logo

కారు పల్టీ.. ఒకరి మృతి

విజయవాడకు చెందిన వారంతా స్నేహితులు. వారిలో ముగ్గురు ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్తున్నారు.

Published : 23 Jan 2023 05:26 IST

ముగ్గురికి తీవ్ర గాయాలు

మృతుడు బేగ్‌ మెహిబుల్లా

నందిగామ, న్యూస్‌టుడే: విజయవాడకు చెందిన వారంతా స్నేహితులు. వారిలో ముగ్గురు ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్తున్నారు. మొక్కు చెల్లింపు కోసం ఆలయానికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణమైన ఆరుగురు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై సురేష్‌ కథనం ప్రకారం.. విజయవాడ మారుతీనగర్‌, మాచవరం ప్రాంతానికి చెందిన ఉప్పు మురళీ ఈ నెల 27న లండన్‌ వెళ్తున్నందున ఆయన సోదరుడు శివకాంత్‌ పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు మొక్కు తీర్చుకునే కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. మురళీతో పాటు బోదనంపాటి మనోజ్‌, మరో స్నేహితుడు కూడా లండన్‌ వెళ్లనున్నారు. వారి స్నేహితులు, బంధువులు కలిపి సుమారు వంద మంది దేవాలయానికి వచ్చారు. సమీప మామిడి తోటలో సరదాగా గడిపారు. భోజనాలు ముగించుకొని విజయవాడ పయనమయ్యారు. అందులో ఆరుగురు ఓ కారులో బయలు దేరారు. నందిగామ మండలం ఐతవరం గ్రామం దాటాక కారు డివైడర్‌ని ఢీకొట్టి ముందు బైక్‌ నడుపుతున్న వ్యక్తి తలపై నుంచి వెళ్లి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న విజయవాడ చుట్టగుంట ప్రాంతానికి చెందిన బంగారం దుకాణంలో పని చేసే బేగ్‌ మెహిబుల్లా, చింతా లోహిత, మద్దినేని మేఘనకు తీవ్రంగా, గాయత్రికి స్వల్పంగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కంచికచర్ల మండలం పెండ్యాలకు చెందిన ఎస్‌.కె.ముబాషర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందులో బేగ్‌ మెహిబుల్లా (22) మృతి చెందారు. మిగిలిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ పంపించారు. స్నేహితులు, బంధువులు వైద్యశాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని