logo

బైపాస్‌కు విద్యుత్తు లైన్లు అడ్డు..!

‘మా పొలాలకు వెళ్లకుండా అడ్డుగోడలు ఎందుకు నిర్మిస్తున్నారు. వీటిని తొలగించాల్సిందే..’ అని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రైతులు విజ్ఞాపన పత్రం అందించారు. నున్న ప్రాంతంలో ఆందోళన చేశారు.

Updated : 31 Jan 2023 04:58 IST

13 ప్రాంతాల్లో మార్చేందుకు ఏర్పాట్లు
ఈనాడు, అమరావతి

* ‘ఇప్పుడున్న హైటెన్షన్‌ విద్యుత్తు లైను మార్చితే.. నాకున్న ఎకరం పొలం వదులు కోవాల్సిందే. వారు ఇచ్చే.. పరిహారం ఏమాత్రం సరిపోదు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఉన్న ప్రాంతంలోనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి..!’

-నున్న ప్రాంతానికి చెందిన ఓ రైతు జాతీయ రహదారి బైపాస్‌ నిర్మాణసంస్థ వద్ద చేసుకున్న విన్నపం..!

* ఇది ఒక రైతు గోడు కాదు.. పలువురు రైతులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి అడ్డంగా ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు మార్చాలని నిర్మాణ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుకు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది.


* రెండు జిల్లాల్లో 13 చోట్ల  హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు మార్చాల్సి ఉంది. దీనికి అదనంగా మరో 1.50 కిలోమీటర్లకు భూసేకరణ జరపాల్సి ఉంది. ఈ లైన్లు మార్చేందుకు రెండు జిల్లాల్లోనూ రైతులు అంగీకరించడం లేదు. దీంతో  ఈప్రాంతాల్లో నిర్మాణం ఆగిపోయింది. కృష్ణా జిల్లాలో రెండు ప్రాంతాల్లో, ఎన్టీఆర్‌ జిల్లాలో 11 ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. మొత్తం 30 కిలోమీటర్ల దూరం నిర్మాణానికి 20 కిలోమీటర్లు బీటీ వేసి రహదారి సిద్ధం చేశారు. నున్న ప్రాంతంలో సబ్‌స్టేషన్‌ ఉండటం, వీటీపీఎస్‌ లైన్లు ఉండటంతో పలు చోట్ల జాతీయ రహదారిమీదుగా వెళుతున్నాయి. వీటిని పక్కకు జరపాల్సి ఉందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.

విజయవాడ బైపాస్‌ నిర్మాణం

‘మా పొలాలకు వెళ్లకుండా అడ్డుగోడలు ఎందుకు నిర్మిస్తున్నారు. వీటిని తొలగించాల్సిందే..’ అని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రైతులు విజ్ఞాపన పత్రం అందించారు. నున్న ప్రాంతంలో ఆందోళన చేశారు.

విజయవాడ బైపాస్‌ రహదారికి అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. తాజాగా జాతీయ రహదారి పక్కన ప్రహరీ నిర్మాణం చేయవద్దని, ప్రస్తుతం ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు మార్చవద్దని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన భూసేకరణకు తాజాగా రహదారి నిర్మిస్తూ కొత్త నిబంధనలు విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన ఆకృతుల ప్రకారమే నిర్మిస్తున్నామని గుత్త సంస్థ చెబుతోంది.

జాతీయ రహదారికి 2010లోనే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అలైన్‌మెంట్‌ పూర్తి చేసి 90 శాతం సేకరించారు. బీఓటీ కింద గామన్‌ సంస్థ చేపట్టాల్సిన ఈ రహదారి రద్దు చేశారు.  హెచ్‌ఏఎం కింద మూడోసారి పిలిచిన టెండర్లలో మూడోప్యాకేజీని  రూ.1148కోట్లకు మేఘా సంస్థ దక్కించుకుది.  ఈఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా 20 శాతం వరకు పనులు మిగిలి ఉన్నాయి. జక్కంపూడి, గొల్లపూడి రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు కొంతమంది ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు. అప్పటికే ఎకరాకు రూ.25 లక్షల నుంచి 50లక్షల వరకు పరిహారం చెల్లించారు. కొంతమంది రైతుల పరిహారం బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఇంకా ఎక్కువ మొత్తం కావాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల దూరానికి గాను భూసేకరణ సమస్యతో 4కిలోమీటర్ల వరకు గుత్త సంస్థకు అప్పగించలేదు. ఈ రహదారి సర్వీసు రహదారులు లేకుండానే నిర్మాణం చేస్తున్నారు. జక్కంపూడి వద్ద 24 కి.మీ. నుంచి 27 కి.మీ వరకు భూమి అప్పగించలేదు.

ప్రస్తుతం జిల్లాల విభజన ఈ ప్యాకేజీ నిర్మాణానికి సమస్యగా మారింది. కొంత భాగం ఎన్టీఆర్‌ జిల్లాలో మరికొంత భాగం కృష్ణా జిల్లాలోకి వెళ్లింది. గుత్త సంస్థ రెండు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరపాల్సి వస్తోంది.

కొత్త నిబంధన ప్రకారం ఈ రహదారిపై 100 కి.మీ. వేగంతో వాహనాలను అనుమతిస్తారు. ఈ సమయంలో రోడ్డుకు ఏవీ అడ్డంగా ఉండకూడదని ప్రహరీ నిర్మాణం చేయాలనేది నిబంధన. సిమెంట్‌ పోల్స్‌ ఏర్పాటు చేసి ప్రికాస్ట్‌ కాంక్రీట్‌ ప్లాంక్స్‌ ఏర్పాటు చేస్తారు. వీటిని రైతులు అడ్డుకుంటున్నారు. రైతుల సమస్య పరిష్కారమైతే  వచ్చే మార్చి 31నాటికి బైపాస్‌ సిద్ధం అవుతుందని గుత్త సంస్థ ప్రాజెక్టు మేనేజరు చంద్రశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని