logo

గొంతెత్తితే..గెంటేశారు

సామాజిక పింఛన్ల రద్దుపై విజయవాడ కౌన్సిల్‌ సమావేశంలో విపక్ష, పాలకపక్షాల మధ్య రగడ చోటుచేసుకుంది. పింఛన్ల తొలగింపుపై నిరసన తెలిపిన విపక్ష సభ్యులను పాలపపక్షం సస్పెండ్‌ చేసి సభ నుంచి మార్షల్స్‌ చేత బయటకు గెంటివేయించారు.

Updated : 01 Feb 2023 06:59 IST

పింఛన్ల రద్దుపై కౌన్సిల్‌లో రగడ విపక్ష సభ్యుల సస్పెన్షన్‌

సామాజిక పింఛన్ల రద్దుపై విజయవాడ కౌన్సిల్‌ సమావేశంలో విపక్ష, పాలకపక్షాల మధ్య రగడ చోటుచేసుకుంది. పింఛన్ల తొలగింపుపై నిరసన తెలిపిన విపక్ష సభ్యులను పాలపపక్షం సస్పెండ్‌ చేసి సభ నుంచి మార్షల్స్‌ చేత బయటకు గెంటివేయించారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగా, సంతాప తీర్మానాలు, ప్రశ్నోత్తరాల గంట ముగిశాక, అజెండాపై చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా విపక్షాల ఫ్లోర్‌లీడర్లు నెలిబండ్ల బాలస్వామి, బోయి సత్యబాబు, మిగిలిన సభ్యులు మాట్లాడుతూ నగరంలో దాదాపు 4వేలకు పైగా పింఛన్లు రద్దుచేయడంతో అనేక మంది అర్హులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. వారి వాదనను మేయర్‌, అధికారపక్షం సభ్యులు ఖండించారు. విపక్ష సభ్యులు కావాలనే సభలో అల్లరి చేస్తున్నారంటూ వారిని సస్పెండ్‌ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని వైకాపా సభ్యులు డిమాండ్‌ చేశారు.  తెదేపా సభ్యుడు ముమ్మునేని ప్రసాద్‌ కల్పించుకుని నగరంలో ఎన్ని పింఛన్లు రద్దు చేశారు? మరెన్ని పునరుద్ధరిస్తారు..?  వంటి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వైకాపా కార్పొరేటర్‌ మహదేవు అప్పాజీ మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాం నుంచి వస్తున్న పింఛన్లు ప్రస్తుతం రద్దు కావడంతో తాము కూడా ప్రజలకు తగిన సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శానససభ్యుడు మల్లాది విష్ణు కల్పించుకుని, అర్హులకు తాము పింఛన్లు తొలగిస్తున్నామంటూ కౌన్సిల్‌ ద్వారా ప్రజలకు అవాస్తవాలు చెప్పాలని విపక్షాలు యత్నిస్తున్నాయని ఆరోపించారు. మూడు నియోజకవర్గాల్లో కేవలం 1692 మాత్రమే ప్రస్తుతం రద్దయ్యాయని వెల్లడించారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి  సొమ్ము అందిస్తున్నామనే విషయం సభలోని ‘పచ్చచొక్కా..ఎర్ర చొక్కా’ వాళ్లు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాల సభ్యులు ఆగ్రహంతో పోడియం వద్దకు వచ్చేందుకు యత్నించగా మేయర్‌ అడ్డుకున్నారు.

అధికారుల వివరణపై అసంతృప్తి

తెదేపా, సీపీఎం పక్షాల సభ్యులు మాట్లాడుతూ నగరంలో 4780 మందికి పింఛన్లు రద్దు చేశారని, సంబంధిత జాబితా తమవద్ద ఉందని సభలో ప్రదర్శించారు. వెంటనే వాటిని పునరుద్ధరించేలా రూలింగ్‌ ఇవ్వాలని మేయర్‌ను కోరారు.   స్పందించిన ఆమె.. అర్హులకు పింఛన్లు పునరుద్ధరించామని చెప్పారు. దీనిపై తెదేపా సభ్యుడు ముమ్మనేని ప్రసాద్‌ మాట్లాడుతూ పింఛన్లు తొలగించిన విషయాన్ని వైకాపా సభ్యులు సైతం ఒప్పుకుంటున్నారని దీనిపై వివరణ ఇప్పించాలని కోరారు. ఆపై యూసీడి పీవో శకుంతల సభలో ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విపక్షాలు, అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైకాపా ప్లోర్‌లీడర్‌ వెంకట సత్యనారాయణ తదుపరి ప్రతిపాదిత అంశాల తీర్మానాలను కొనసాగించేందుకు యత్నించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాల సభ్యులు.. మేయర్‌ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు.  

విష్ణు సూచనలతో...  

విపక్ష సభ్యుల నిరసన కొనసాగిస్తుండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన శాసనసభ్యుడు మల్లాది విష్ణు.. ఉప మేయర్‌ బెల్లం దుర్గను పిలిచి, వారిని సస్పెండ్‌ చేయించాలని సూచించారు. ఆమె విషయాన్ని వైకాపా ఫ్లోర్‌లీడర్‌ దృష్టికి తేవడంతో, ఆయన సూచనలపై మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి సీపీఎం, తెదేపా ఫ్లోర్‌లీడర్లు బోయి సత్యబాబు, నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నగిరి రామ్మోహనరావు తదితరులను  సస్పెండ్‌ చేశారు. అనంతరం వారిని మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీనిని నిరసిస్తూ మిగిలిన తెదేపా సభ్యులు సైతం సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం వారంతా కౌన్సిల్‌ ప్రాంగణంలో బైఠాయించి, పాలకపక్షం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు