logo

‘కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం’

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం జాప్యం చేస్తోందని, భాజపాతో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 04:48 IST

మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం జాప్యం చేస్తోందని, భాజపాతో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం బీసీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెడితే పాస్‌ అయ్యేలా చేస్తామంటూ భాజపా లేఖలు మీద లేఖలు రాసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామన్న ప్రధాని మోదీ.. వంద నెలలైనా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫలితంగా మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేసి, తమ డిమాండ్‌లను సాధించి తీరతామన్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో మహజన సోషలిస్టు పార్టీ (ఎం.ఎస్‌.పి.) ఆధ్వర్యంలో ‘చలో దిల్లీ’కి పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌, విజయవాడలోని భాజపా కార్యాలయాల ముట్టడి, 4న నగరాల దిగ్భందం చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేసి, భాజపా మాదిగల హృదయాల్లో చోటు సంపాదించుకుంటుందో.. లేక ఆగ్రహానికి గురవుతుందో తేల్చుకోవాలన్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, మాదిగ అనుబంధ సంఘాలన్నీ నిరసనల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్‌ నాయకులు ముమ్మడివరపు చినసుబ్బారావు మాదిగ, మంద వెంకటేశ్వరరావు మాదిగ, ఎం.ఎస్‌.పి. నాయకులు మంద వేణు, కోట దానియేలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని