logo

ఉద్యమమే శరణ్యం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని.. ఉద్యమమే శరణ్యమని ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు.

Published : 27 Mar 2023 05:06 IST

ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు

మాట్లాడుతున్న విద్యాసాగర్‌. చిత్రంలో ఇక్బాల్‌, రాజుబాబు, రమేష్‌, సతీష్‌కుమార్‌ తదితరులు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని.. ఉద్యమమే శరణ్యమని ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. నాలుగేళ్లుగా ఏ ఒక్క డిమాండ్‌ నెరవేర్చకపోగా.. సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఉద్యమబాట చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఎన్జీవో భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేతన సవరణలో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇంటి అద్దె అలవెన్స్‌, ఫిట్‌మెంట్‌ని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. పే స్కేల్‌ జీవో ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏడాదిపైగా సమయం పట్టిందని విమర్శించారు. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ బకాయిలను కొంత వరకు విడుదల చేయడం సంతోషకరమని, మిగిలిన బకాయిలు, రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ సెలవుల బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు రావాల్సిన మూడు డీఏల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరవుభత్యం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్న కాంట్రిబ్యూషన్‌ని ఉద్యోగుల ప్రాన్‌ అకౌంట్‌కు ప్రభుత్వం జమ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వం దఫదఫాలుగా మంత్రివర్గ కమిటీ, చీఫ్‌ సెక్రటరీతో అనేక సమావేశాలు నిర్వహించి, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడం విచారకరమన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి ఎం.డి.ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. రవాణా ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజుబాబు మాట్లాడుతూ.. ఉద్యోగుల మెడికల్‌తో పాటు పిల్లల చదువుల వివాహం నిమిత్తం ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు పి.రమేష్‌, బి.సతీష్‌కుమార్‌, బి.వి.రమణ, ఆర్‌.శ్రీనివాసరావు, డి.విశ్వనాథ్‌, బి.నాగేంద్రరావు, కె.శివలీల, సి.హెచ్‌.కృష్ణమోహన్‌, శ్రీరామ్‌, నజీరుద్దీన్‌, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని