logo

దుమ్ము రేగుతోంది

బాబ్బాబు..ఈ రహదారి పనులు పూర్తి చేసి పుణ్యం కట్టుకోరూ అంటూ ఉయ్యూరు నుంచి తోట్లవల్లూరు మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద నెత్తీనోరు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

Updated : 28 Mar 2023 06:04 IST

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు, జనార్దనపురం(నందివాడ)

బస్సు వెనుక రహదారి కనిపించని విధంగా..

బాబ్బాబు..ఈ రహదారి పనులు పూర్తి చేసి పుణ్యం కట్టుకోరూ అంటూ ఉయ్యూరు నుంచి తోట్లవల్లూరు మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద నెత్తీనోరు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అధ్వానంగా తయారైన తోట్లవల్లూరు-ఉయ్యూరు ఆర్‌అండ్‌బీ రహదారిని సుమారు రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని పనులు చేపట్టారు. గుంతలుగా మారిన ఈ మార్గాన్ని మొత్తం తవ్వేసి, పాత కల్వర్టులున్న చోట కొత్తవి నిర్మించారు. అనంతరం మెటల్‌ పరిచి లెవలింగ్‌ చేశారు. రెండు నెలలు గడిచినా ఇంత వరకూ తారురోడ్డు వేయలేదు. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. రహదారి మొత్తం రాళ్లు పైకి తేలడంతో విపరీతమైన దుమ్ము లేస్తోంది. దీనివల్ల ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ రహదారిపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోందని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారిని త్వరగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

జనార్దనపురం-నందివాడ మధ్య..

జనార్దనపురం-నందివాడ మధ్య 1.5 కిలోమీటర్ల పరిధిలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి దుస్థితి కూడా దీనికి తీసికట్టుగానే ఉంది. మొన్నటి వరకూ గుంతలు, నేడు దుమ్ముతో తీవ్రమైన అవస్థలు పడుతున్నామని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ రోడ్డు వర్షాకాలంలో పెద్ద గుంతలతో ఉండడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వాన నీటితో నిండిన గుంతల్లో ఎక్కడ పడతారో తెలియని పరిస్థితిలో ఈ మార్గంలో ప్రయాణించేందుకు ప్రజలు వణికిపోయారు. ప్రయాణికుల అభ్యర్ధన మేరకు గుంతలను చదును చేసి రహదారిపై తూతూ మంత్రంగా కంకర, రాళ్లపొడి మిశ్రమాన్ని పరిచి వదిలేశారు. తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ ప్రస్తుతం దుమ్ము రేగుతూ వెనుకొచ్చే వాహనదారులకు ఏమీ కనిపించని దుస్థితి. చేపల చెరువులకు లారీల రాకపోకలు అధికమవడంతో తీవ్రస్థాయిలో దుమ్ములేచి వాహనచోదకులు, ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేయించి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

తోట్లవల్లూరు - ఉయ్యూరు రోడ్డుపై..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని