logo

అయిననూ హస్తినకు పోయిరావలె

రెండు వేల పెద్ద లడ్డూలు పంపినా, పని జరగక ‘అయిననూ హస్తినకు పోయి రావాలంటూ’ ముఖ్యమంత్రి ఎందుకు దిల్లీకి వెళుతున్నారో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 30 Mar 2023 02:16 IST

సీఎంపై మాజీ మంత్రి ఎద్దేవా

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు

మైలవరం, న్యూస్‌టుడే: రెండు వేల పెద్ద లడ్డూలు పంపినా, పని జరగక ‘అయిననూ హస్తినకు పోయి రావాలంటూ’ ముఖ్యమంత్రి ఎందుకు దిల్లీకి వెళుతున్నారో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావం, తన పుట్టినరోజు వేడుకల అనంతరం జరిగిన సభలో ఉమా మాట్లాడారు. బాబాయ్‌ హత్య కేసులో తన ఎంపీ తమ్ముడిని కాపాడుకోవడానికే సీఎం దిల్లీకి కాళ్ల బేరానికి వెళుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి, మైలవరం ప్రాంతానికి సమృద్ధిగా నీరందించడమే తన జీవితాశయన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ పథకానికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే, తిరువూరుకు వచ్చిన ముఖ్యమంత్రి పనుల ఊసే ఎత్తలేదన్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేతగాక, తమ మీద కోపం చూపుతున్నారని, సమయానికి మందులేసుకో బాబూ అంటూ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమను ఏం చేయలేరన్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఓటర్లు ఓటమి చూపారన్నారు. రాష్ట్రం బాగు పడాలంటే సైకో పోయి..సైకిల్‌ రావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు. ఒకప్పుడు మైలవరంలోని పూరగుట్టలో దొంగ పట్టాలంటూ నానా యాగీ చేశారని, తాను పంచిన ఆ స్థలాలు లేకుండా కాలనీలు ఎక్కడ కడతారోనని ఎద్దేవా చేశారు. అయిదు లక్షల ఇళ్లు కడతామని దొంగ మాటలు చెప్పి మాయ చేశారన్నారు. అకాల వర్షాలకు రైతులు కోట్లాది రూపాయల పంట నష్టపోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. తమ ఫ్లెక్సీలు అడ్డుగా ఉన్నాయంటూ జులుం చూపుతున్న అధికారులకు వైకాపా ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని