logo

మిగులు పేరుతో దోపిడీ

‘పోలవరం కుడి కాలువపై మట్టి తవ్వకాలకు చాలా మంది దరఖాస్తు చేశారు. కానీ ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అనధికార తవ్వకాలను పరిశీలించి కేసులు నమోదు చేస్తాం.’

Published : 30 Mar 2023 03:09 IST

అనుమతి లేదంటూనే అక్రమ తవ్వకాలు
విచారణ లేదు.. కేసులు లేవు
పోలవరం కుడి కాలువ గట్టుపై తీరు
ఈనాడు, అమరావతి

‘పోలవరం కుడి కాలువపై మట్టి తవ్వకాలకు చాలా మంది దరఖాస్తు చేశారు. కానీ ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అనధికార తవ్వకాలను పరిశీలించి కేసులు నమోదు చేస్తాం.’

* గత నెల బాపులపాడు మండలంలో పోలవరం కుడికాలువ గట్టుపై 110వ కిలోమీటరు వద్ద మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని ‘ఈనాడు’ ఈఈ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఇచ్చిన వివరణ ఇది. అక్కడ 110 కి.మీ. నుంచి 121 కి.మీ వరకు కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వేశారు. అయినా చర్యలు లేవు.

ఈఈ జారీ చేసినట్లు చెబుతున్న అనుమతి పత్రం

ఈ అనుమతి పత్రం చూశారా..! ఇది తాజాగా జారీ చేసిన అనుమతి (వర్క్‌ ఆర్డర్‌) పత్రం. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కె.శ్రీనివాసరావు జారీ చేశారు. గతంలో (2022లో) ఒప్పందం కుదిరిన తవ్వకానికి సంబంధించి మిగిలిన 4,500 ఘనపు మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతి జారీ చేశారు. ఈ మట్టిని ఈ నెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు తవ్వకాలు, రవాణా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి అనే ప్రశ్నలు తలెత్తవు. ఏపీఐఐసీ పనులకు సంబంధించి ఈ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఏపీఐఐసీకి సొంత పనులే లేవు. ప్రస్తుతం విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణం చేస్తోంది. దానికి మట్టి అవసరం లేదు. అసలు పోలవరం కట్టలపై మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదంటూ.. మిగులు తవ్వకాల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు.

పేరుకే ఈ అనుమతి పత్రం. ఎవరైనా అడ్డగిస్తే ఈ అనుమతి పత్రం చూపిస్తున్నారు. కానీ ఇష్టానుసారం తవ్వకాలు జరుగుతున్నాయి. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఎత్తుకెళ్లారు. ఇటీవల నిర్మాణం చేసిన జాతీయ రహదారి పక్కన వేసిన ఓ ప్రైవేటు వెంచర్‌కు, గుంటూరు ప్రాంతానికి ఈ మట్టి లారీల్లో తరలిపోతోంది. ఒకటి కాదు రెండు వందల టిప్పర్లు తిరుగుతున్నాయి. మట్టి తరలింపును అడ్డుకున్న బీబీగూడెం గ్రామస్థులపై ఎదురుదాడికి దిగారు. కనీసం పోలీసులు కానీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. పోలవరం కట్టల తవ్వకాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సమయంలోనూ అడ్డూఅదుపూ లేకుండా తవ్వకాలకు పాల్పడుతున్నారు. బాపులపాడు మండలం పోలవరం కుడికాలువ 110 కిలోమీటరు నుంచి 121 కిలోమీటరు మధ్య లక్షల ఘనపు మీటర్ల మట్టి తవ్వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే బినామీ ఒకరు విజయవాడ నగర శివారులో వేస్తున్న వెంచర్లకు ఈ మట్టి తరలిపోయింది. అధికారులు అడిగితే మాత్రం జగనన్న లేఔట్‌ మట్టి తవ్వకాలకంటూ సమాధానం ఇస్తున్నారు. వాహనాలకు సైతం ప్రభుత్వ పనులకు తరలింపు అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు.

అధికారుల మౌనం..

‘పోలవరం కుడికాలువ కట్టపై మట్టి తవ్వకాలకు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన అనుమతులకు గడువు ముగిసింది. ప్రస్తుతం కొన్ని దరఖాస్తులు పరిశీలనలోనే ఉన్నాయి. కానీ ఎక్కడా అనుమతులు ఇవ్వలేదు. ఎక్కడ మట్టి తవ్వకాలు జరిగినా... అవి అనధికారమే.. అక్రమ తవ్వకాలే. వెంటనే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని స్వయంగా పోలవరం ప్రాజెక్టు ఈఈ చెప్పినా ఎక్కడా తవ్వకాలు ఆగలేదనడానికి బీబీగూడెం సంఘటన నిదర్శనంగా మారింది. రాజకీయ ఒత్తిడితోనో.. లేక కమీషన్ల వల్లనో అధికారులు మౌనంగా ఉంటున్నారు. కొన్ని అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. కొన్ని బోగస్‌వి పుట్టుకొస్తున్నాయి. వాటిపై విచారణ ఉండటం లేదు. కనీసం తనిఖీలు, కేసులు ఉండటం లేదు. చాలా వరకు పోలవరం కుడి కాలువ బలహీన పడింది. నిబంధనల ప్రకారం క్యూబిక్‌ మీటరుకు రూ.45 రాయల్టీని గనుల శాఖకు, రూ.90 చొప్పున జలవనరుల శాఖకు చెల్లించాల్సి ఉంది. అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానా నష్టపోవడమే కాకుండా.. పోలవరం కట్టలు బలహీనంగా మారుతున్నాయి. దీనిపై మరోసారి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీనివాసరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని