logo

అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం కందిపప్పు

పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్‌ నెల పంపిణీ నిమిత్తం రేషన్‌ డిపోలకు చేరిన కందిపప్పు నాసిరకంగా ఉంది.

Published : 08 Jun 2023 05:32 IST

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు జూన్‌ నెల పంపిణీ నిమిత్తం రేషన్‌ డిపోలకు చేరిన కందిపప్పు నాసిరకంగా ఉంది. ప్యాకెట్లలో వచ్చిన ఈ కందిపప్పు.. బూజు, పురుగుపట్టిన రీతిలో ఉంది. ఎండీయూ వాహనాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. తీసుకునేందుకు పలు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1450 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటికి గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారానే నేరుగా బియ్యం, నూనెతో పాటుగా కందిపప్పు అందిస్తోంది. ఒక్కో కేంద్రంలో సరాసరి 20 మంది పిల్లలు, 20 మంది గర్భిణులు నిత్యం ఈ పప్పుతో వండిన కూరనే తినాల్సి ఉంది. పంపిణీ నిమిత్తం డిపోలకు చేరిన కందిపప్పు ఒకింత నాణ్యత లేక పోవడంతో పలు డీలర్లు సైతం ఈ విషయాన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు నాణ్యతతోనే ఉందని, ఎక్కడైనా బాగోక పోతే వెంటనే కేంద్రాల సిబ్బంది కానీ, డీలర్లు కానీ తెలియజేస్తే వెంటనే వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఎల్‌ఎంఎస్‌ పాయింట్ల నుంచి వేరొక కందిపప్పును అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని