logo

కన్నుమన్నూ..కానరంతే..!

మైలవరం పరిధిలో కొండపల్లి అభయారణ్యంలో దాదాపు రూ.150 కోట్ల విలువైన గ్రావెల్‌ తరలించారు. కొత్తూరు తాడేపల్లిలోనూ భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. పోలవరం కాలువ కట్టలపై తవ్వుతున్నారు.

Published : 09 Jun 2023 04:39 IST

చెరువులు గుల్ల చేస్తున్న నేతలు..! ‌
గ్రామాల్లో ఏకంగా మట్టి తవ్వకాలకు వేలం
ఈనాడు, అమరావతి

మైలవరం పరిధిలో కొండపల్లి అభయారణ్యంలో దాదాపు రూ.150 కోట్ల విలువైన గ్రావెల్‌ తరలించారు. కొత్తూరు తాడేపల్లిలోనూ భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. పోలవరం కాలువ కట్టలపై తవ్వుతున్నారు. దీనిపై ఎన్జీటీలో కేసు విచారణలో ఉన్నా అడ్డూఆపూ లేకుండా తవ్వి జాతీయ రహదారి నిర్మాణానికి నేతలు తరలిస్తున్నారు.

బినామీలతోనే..!

కృష్ణా జిల్లాలో నేతల బినామీలే మట్టి తవ్వుతున్నారు. గన్నవరం, గుడివాడ, పెనమలూరు, బందరు, పామర్రు నియోజకవర్గాలు కేంద్రాలుగా మారాయి. గన్నవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అనధికార తవ్వకాలు జరుపుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. వైకాపాలో రెండు వర్గాల అనుచరులు తవ్వేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధిదే ఆధిపత్యం. ఇక్కడ అధికారులు సైతం మౌనంగా ఉండాల్సిందే. ఇష్టానుసారం తవ్వి తరలిస్తున్నారు. చేపల చెరువుల పేరుతోనూ భారీగా తవ్వుతున్నారు. గుడివాడ సమీపంలో లే ఔట్లకు భారీగా తరలిస్తున్నారు. గత ఏడాది ఓ ఆర్‌ఐపైనే దాడి చేసి ఎదురు కేసు పెట్టారు.. పెనమలూరు పరిధిలో ప్రైవేటు వెంచర్లకు భారీగా తరలిస్తున్నారు. కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లో వేల క్యూబిక్‌ మీటర్లు తవ్వేస్తున్నారు. ఇక్కడ కొత్త వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. నియోజకవర్గాల్లో చెరువుల మట్టి తవ్వకాలకు వేలం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి మట్టి తవ్వకాలకు రెవెన్యూ, గనుల శాఖ అనుమతి కావాలి. సీనరేజీ చెల్లించాలి. సీనరేజీ పేరుతోనే రూ.కోట్లలోనే ఎగనామం పెడుతున్నారు.

* జి.కొండూరు మండలంలో చెరువుల్లో మట్టి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ రేగడి నల్ల మట్టి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. జి.కొండూరు పరిధిలో ఇటుక బట్టీలకు మట్టి డిమాండ్‌ అధికంగా ఉంది. వెలగలేరు, జి.కొండూరు చెరువుల్లో మట్టి రాత్రీ పగలు తవ్వుతున్నారు.

* మైలవరం వెల్వడంలో చెరువుల్లో నీరు తీసి మరీ మట్టి తవ్వుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనూ మట్టి తవ్వకాలు అధికారపార్టీ వారే చేపడుతున్నారు.

* రెడ్డిగూడెం ప్రాంతంలో సాగర్‌ జలాలను మళ్లించి చెరువుల్లో మట్టి తవ్వకాలు జరపడం విశేషం. ఇలా తవ్విన మట్టి ఇటుక బట్టీలకు తరలిపోతుండగా.. అవసరమైతే ఉపాధి హామీ కింద బిల్లులు చేసేందుకు నేతలు వెనుకాడటం లేదు. కట్ట పటిష్టం పేరుతో నరేగా బిల్లులకు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అమృత్‌ సరోవర్‌ చెరువుల్లో మట్టి తరలిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.

ఇదీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి. వైకాపా నేతల కన్ను మన్నుపై పడింది. రెండు జిల్లాల పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాల జోరు పెరిగింది. అధికార పార్టీ నేతలు మట్టి తవ్వకాలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.  నివేశన స్థలాల చదునుకు కొంత, ఇటుక బట్టీలకు మరికొంత తరలిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ నాయకుల హవా నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్యనే మట్టి తవ్వకాలపై విభేదాలు తలెత్తుతున్నాయి.

ఈ చిత్రం చూశారా..? గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఎర్రకుంట చెరువు. 40 ఎకరాల్లో ఉన్న చెరువు ఎర్రమన్ను ఇష్టానుసారం తవ్వారు. తవ్వుతూనే ఉన్నారు. అదేమంటే తమకు ఎమ్మెల్యే అనుమతి ఉందని సమాధానం. రంగన్నగూడెం చెరువు 170 ఎకరాలు ఉండగా.. దీని ఆయకట్టు 300 ఎకరాలు. దీన్ని కొన్ని వందల ఘనపు మీటర్ల తవ్వకాలు జరిపారు. అడ్డుకునేవారు, అడిగేవారు లేరు.

మైలవరం నియోజకవర్గం.. పుల్లూరులో వైకాపా నాయకులు వందల ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేపట్టారు.  అక్కడ రెండు వర్గాల వైకాపా నాయకుల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే సర్దుబాటు చేశారు. కొన్ని రోజులు ఒక నాయకుడు, మరికొన్ని రోజులు ఇంకో నాయకుడు తవ్వేలా అనువుగా తీర్మానం చేశారు. ఈ మట్టి ఇటుక బట్టీలకు తరలిపోతోంది.

పామర్రు మండలం పోలవరం చెరువులో అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. పంచాయతీకి రూ.8 లక్షలు చెల్లించేలా ఒప్పందం. దానికి మట్టి తవ్వకాలకు అనధికార అనుమతులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉంది. ఇష్టానుసారంగా తవ్వి మట్టి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పరు మట్టి ధర రూ.8వేలు. కొన్ని వందల టిప్పర్లు తరలించడం ఆనవాయితీగా మారింది. పామర్రు నియోజకవర్గంలో పలు మండలాల్లో నాయకులు స్థానికంగా రాజీలు కుదర్చుకుని మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని