logo

ఏలూరు... ఏటికి మారేను..?

రెండు జిల్లాలు, ఆరు మండలాలు, లక్ష పైచిలుకు ఆయకట్టుకు సాగునీరందించే ఏలూరు కాల్వ నిర్వహణపై జలవనరులశాఖ అధికారుల అలసత్వం కొనసాగుతూనే ఉంది.

Published : 09 Jun 2023 04:39 IST

నిర్వహణ లోపంతో కడగండ్లు
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

రెండు జిల్లాలు, ఆరు మండలాలు, లక్ష పైచిలుకు ఆయకట్టుకు సాగునీరందించే ఏలూరు కాల్వ నిర్వహణపై జలవనరులశాఖ అధికారుల అలసత్వం కొనసాగుతూనే ఉంది. ఖరీఫ్‌ సాగుకు ముందస్తుగా నీరు విడుదల చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న తరుణంలో ప్రధాన కాల్వ తీరు అధ్వానంగా తయారైంది. చివరి ఆయకట్టు వరకూ నీరందించే సంగతి పక్కనబెడితే, అసలు కాల్వలో సక్రమంగా నీరు ప్రవహించడమే ప్రశ్నార్థకంగా మారింది. ప్రవాహానికి వీలుగా ప్రధాన కాల్వతో సహా ఉపకాల్వలను సిద్ధం చేయడంలో ఈ ఏడాది కూడా అధికారుల లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఫలితంగా నారుమళ్లకు, పొలాలకు నీరందించేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సన్నద్ధత నామమాత్రం

వాస్తవానికి ఏప్రిల్‌, మే నెలల్లో ప్రధాన, ఉప కాల్వల నిర్వహణ, మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో నీటి సంఘాలను సమన్వయం చేస్తూ అధికారులు ఇందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఏటా ఈ ప్రక్రియ ‘మమ’ అన్పించేస్తుండటంతో కీలక తరుణంలో ఆయకట్టు చివరి భూములకు నీరందడం గగనంగా మారుతుంది. కృష్ణాజిల్లా పరిధిలో ఏలూరు కాల్వ దాదాపుగా గన్నవరం నియోజకవర్గంలోనే ఉంది. సరైన నిర్వహణ చేపట్టకుండానే నీరు విడుదల చేయడంతో ప్రతిసారి ఎక్కడో ఒకచోట గుర్రపుడెక్క, తూడు, నాచు అడ్డుపడడం, దీని వల్ల ప్రధాన కాల్వ నుంచి పిల్ల కాల్వలకు వెళ్లవలసిన నీటి ప్రవాహం మందగిస్తుంది.
ఇంజిన్లే ఆధారం: నీటి ప్రవాహం తగినంతగా రాకపోవడంతో రైతులు పొలాలకు నీరందించేందుకు ఏటా ఆయిల్‌ ఇంజిన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులు సొంతగా వీటిని కొనుగోలు చేస్తుండగా, సన్న, చిన్నకారు రైతులు వాటిని అద్దెకు తెచ్చి నీరందాల్చిన దుస్థితి ఏర్పడింది. ఇందుకోసం వీరంతా రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే కాల్వలు సక్రమంగా ఉంటే నీటి ప్రవాహం సాఫీగా ఉండి పొలాలకు బోదెల నుంచి నీరు చేరుతుంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కన్పించడంలేదు. కోన్ని చోట్ల ప్రధాన కాల్వ నుంచే ఇంజిన్లతో నీరందిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాల్లో ఖరీఫ్‌ వరి సాగు విస్తీర్ణం అంచనా దాదాపు 60 వేల ఎకరాలు ఉండగా, పూర్తి ఆయకట్టుకు సరిపడా నీరందించడం కష్టసాధ్యమవుతుంది.

సామర్థ్యం..శుభ్రత ఏవీ?: వాస్తవానికి ఏలూరు కాల్వ పూర్తి సామర్థ్యం 1,650 క్యూసెక్కులు..కానీ ఎప్పుడూ వెయ్యి క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేసిన సందర్భాల్లేవు. ఒకవేళ అంతకుమించి విడుదల చేసినా కాల్వ గట్లు ఎంతవరకు పటిష్టంగా ఉంటాయనేది ప్రశ్నార్థకం. అందుకే చివరి భూములకు చేరినా, చేరకున్నా వెయ్యి క్యూసెక్కులతోనే సరిపెట్టాయాల్సి వస్తుంది. మరో వైపు రెండు జిల్లాల పరిధిలో 50కు పైగా గ్రామాల్లో మంచినీటి చెరువుల్ని ఈ కాల్వ ద్వారానే నింపి, రక్షిత పథకాల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది. కాల్వ నిర్వహణ ఏనాడూ సక్రమంగా లేకపోవడంతో అపరిశుభ్రమైన నీటినే తాగునీటిగా వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది.

ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద కాల్వలో గుర్రపు డెక్క

జాడలేని పనులు: కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలోని 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఏలూరు కాల్వపై ఆధారపడి ఉంది. రైతులు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి సాగుకు కృషి చేస్తుంటే, అధికారులు మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఏటా సాగు అవసరాలకు నీరు వదిలే ముందు ట్రాక్టర్లతో దమ్ము చేయడం, గుర్రపుడెక్క దట్టంగా అల్లుకుపోతే యంత్రంతో తొలగించడం వంటివి చేపడుతుంటారు. ఈ ఏడాది ఆ తరహా పనులు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కన్పించలేదు. దీంతో కాల్వ పొడవునా డెక్క, నాచు కన్పిస్తుంది. ప్రతి ఖరీఫ్‌ మధ్యలో ఉంగుటూరు-బాపులపాడు మండలాల సరిహద్దు నుంచి ప్రవాహం మందకొడిగా ఉంటుంది. గుర్రపుడెక్క దట్టంగా అల్లుకుపోయినా, సకాలంలో తొలగించకపోవడమే దీనికి కారణంగా కన్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని