logo

విధితో ఓడిన విజేత

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆ యువకుడి తపన ముందు కష్టాలు నిలబడలేకపోయాయి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టినా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. విజేతగా నిలిచి సరికొత్త జీవితంలో అడుగుపెట్టి తనుకన్న కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్న సమయం

Published : 20 May 2022 03:23 IST

విద్యుదాఘాతంతో మారిన యువకుడి తలరాత

ఉద్యోగం సాధించినా.. కల్లలైన కలల జీవితం

జాయినింగ్‌ రిపోర్టు చూపుతున్న బాధితుడి కుటుంబ సభ్యులు

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆ యువకుడి తపన ముందు కష్టాలు నిలబడలేకపోయాయి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టినా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. విజేతగా నిలిచి సరికొత్త జీవితంలో అడుగుపెట్టి తనుకన్న కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్న సమయంలో.. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. ప్రమాదం రూపంలో విధి విపత్కర పరిస్థితిని కల్పించింది. విధి ఆడిన విద్యుదాఘాత నాటకంలో ఓడిన విజేత కథ ఇది. - న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

ధర్మవరం మండలం కనుంపల్లికి చెందిన పెద్ద నాగన్న, సాకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి మూడెకరాల పొలం ఉంది. సాగు పనులు లేనప్పుడు కూలీకి వెళ్లేవారు. పెద్దకుమారుడు వ్యవసాయం చేస్తుండగా.. రెండో కుమారుడు నాగేంద్ర భాస్కర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐటీ చేశాడు. అనంతరం పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి రెండేళ్ల పాప ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో జేఎల్‌ఎం ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. కష్టపడి కొలువు సాధించాడు. సీసీ కొత్తకోట పంచాయతీలో జేల్‌ఎం (జూనియర్‌ లైన్‌మ్యాన్‌) గ్రేడ్‌-2 ఉద్యోగిగా నియమిస్తూ అధికారులు నియామక ఉత్తర్వులు అందించారు. 2019 అక్టోబర్‌ 2న కొలువులో చేరాడు. ఉద్యోగం వచ్చిందని ఇంటిల్లిపాదీ సంబరపడ్డారు. కష్టాల నుంచి గట్టెక్కవచ్చని, కూతురిని మంచి పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించవచ్చని కలలు కన్నారు.

సంతోషంగా ఉన్న సమయంలో..

సంతోషంగా గడిపేస్తున్న సమయంలో విధి ఆయన జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. విధి నిర్వహణలో ఉండగా సీసీ కొత్తకోట పంచాయతీలోని నిమ్మలకుంట గ్రామంలో విద్యుత్తు సమస్య వచ్చింది. 2019 అక్టోబర్‌ 18న నాగేంద్ర భాస్కర్‌ విద్యుత్తు స్తంభాన్ని ఎక్కి మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతంతో కిందపడ్డాడు. కాసేపు ప్రశాంతంగా కూర్చొని అనంతరం ద్విచక్ర వాహనంలో సొంత గ్రామమైన కనుంపల్లికి వెళుతుండగా తల తిరిగి కిందపడిపోవంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం బెంగళూరు వైద్యశాలకు తరలించారు.

చందాలు వేసుకొని వైద్యసేవలు..

బెంగళూరు, ధర్మవరం కనుంపల్లిలో ఉంటున్న యువకుడి అన్నదమ్ములు, బంధువులు చందాలు వేసుకొని బెంగళూరులోని ఓ వైద్యశాలలో రూ.20 లక్షల వరకు వెచ్చించి మెరుగైన వైద్యసేవలు అందించారు. రక్తపోటుతో బ్రెయిన్‌లో శస్త్రచికిత్స చేశారు. పక్షవాతం రావడంతో ఎడమ కాలు, చెయ్యి సహకరించడం లేదు. దీంతో ఉద్యోగానికి వెళ్లలేక ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కలలు కన్న జీవితం నెలలోపే కరిగిపోయింది.

ఉన్నతాధికారులకు నివేదించాం

జేఎల్‌ఎం గ్రేడ్‌-2 సిబ్బంది నాగేంద్ర భాస్కర్‌కు 2019లో జరిగిన ప్రమాదంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అధికారులకు నివేదిక పంపాము. ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. - జానకిరామయ్య, విద్యుత్తు ఏఈ

ఉద్యోగం లేదు.. సాయం అందలేదు

విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. అయినా.. సాధించిన ఉద్యోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయమూ అందలేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. కనీసం ప్రభుత్వం అందించే పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆన్‌లైన్‌లో నాకు ఉద్యోగం ఉందని తిరస్కరిస్తున్నారు. ప్రతినెలా మందు బిళ్లల కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. నా భార్య డిగ్రీ వరకు చదివింది. పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఆమెకైనా ఉద్యోగం ఇప్పిస్తే రుణపడి ఉంటాం. - నాగేంద్ర భాస్కర్‌, జేఎల్‌ఎం, కనుంపల్లి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని