logo

అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం

వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను భాజపా ప్రశ్నిస్తుంటే దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ధర్మవరంలో భాజపా కార్యకర్తలపై వైకాపాకు చెందిన దుండగులు దాడిచేసి గాయపరిచారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు.

Updated : 29 Jun 2022 06:45 IST

సమావేశంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను భాజపా ప్రశ్నిస్తుంటే దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ధర్మవరంలో భాజపా కార్యకర్తలపై వైకాపాకు చెందిన దుండగులు దాడిచేసి గాయపరిచారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుతో కలిసి విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పెద్దఎత్తున దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అధికార పార్టీ నాయకులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులుతో వాహనాలను కొనుగోలు చేసి పార్టీ కార్యకర్తలకు ఇచ్చి రేషన్‌ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసి పెద్దఎత్తున స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్న సమయంలో ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఉత్తుత్తి మాటలు, బటన్‌లు నొక్కడం నిత్యకృత్యంగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో 60 నుంచి 90 శాతం వరకు కేంద్రం నిధులేననీ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం అమ్మఒడి ఒక్కటేనని చెప్పారు. ఆ పథకం అమలులో అవకతవకలు, గందరగోళ ప్రకటనలు, ఆర్భాటం ఎక్కువయ్యాయన్నారు. మూడేళ్ల పాలనపై వ్యతిరేకత ఏర్పడి ప్రతి చోటా వైకాపా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టడం కోసం అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటామని, తమ కార్యకర్తలకు నష్టం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. భాజపా నాయకులు రామాంజనేయులు, వెంకటేశ్వరరెడ్డి, రవికుమార్‌, మంజుల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని