logo

‘వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్‌’

నియోజకవర్గ వ్యాప్తంగా 14 అంశాలపై సేకరించే ప్రజాభిప్రాయాలను రాష్ట్ర గవర్నర్‌, భారత రాష్ట్రపతికి పార్టీ అధిష్ఠానం ద్వారా నివేదిస్తామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి పేర్కొన్నారు.

Published : 03 Dec 2022 02:35 IST

మలసముద్రంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్న బీకే పార్థసారథి, నాయకులు

గోరంట్ల, న్యూస్‌టుడే: నియోజకవర్గ వ్యాప్తంగా 14 అంశాలపై సేకరించే ప్రజాభిప్రాయాలను రాష్ట్ర గవర్నర్‌, భారత రాష్ట్రపతికి పార్టీ అధిష్ఠానం ద్వారా నివేదిస్తామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకేపార్థసారథి పేర్కొన్నారు. గోరంట్ల మండలం మలసముద్రం గ్రామంలో శుక్రవారం ‘ఇదేంఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సమస్యపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాలనపై ఇదేంఖర్మ అంటున్నారన్నారు. రహదారులు భవనాల శాఖమంత్రిగా కొనసాగిన ఎమ్మెల్యే శంకరనారాయణ ఒక్కరోడ్డు నిర్మించిన పాపానపోలేదని విమర్శించారు. తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్టీ మండల కన్వీనర్‌ సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీహరిపురంలో కరపత్రం అందజేస్తున్న పరిటాల సునీత


‘పిచ్చోడి చేతిలో పాలన’

కుటాగుళ్లలో జరిగిన ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో కందికుంట, తెదేపా నాయకులు

రామగిరి: ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిచ్చివాడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం తలుపూరు, రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామంలో శుక్రవారం ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె  పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. శ్రీహరిపురంలో వాల్మీకి, పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానం

టి.పుట్లవాండ్లపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నాయకులు, కార్యకర్తలు

అమడగూరు: వైకాపా ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. టి.పుట్లవాండ్లపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అన్నారు. అప్పుల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చిందన్నారు.

కదిరి: అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెదేపా బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం కుటాగుళ్లలోని 1, 12, 36వ వార్డుల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనా తీరు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచారం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేసిన వాగ్దానాలను ఏం చేశారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గంగాభవానీ, ముస్తఫా, నాయకులు పర్వీన్‌బాను, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని