logo

కార్మికుల కష్టానికి కదిలిన అధికార యంత్రాంగం

నగరపాలకలోని కార్మికుల కష్టాలపై ఈనాడు- ఈటీవీలో వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది.

Published : 02 Feb 2023 05:24 IST

ఈనాడు-ఈటీవీ కథనాలకు స్పందన

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరపాలకలోని కార్మికుల కష్టాలపై ఈనాడు- ఈటీవీలో వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. కార్మికులతో చర్చలు జరపడంతోపాటు దిల్లీ స్థాయిలో అధికారుల ఆదేశాల మేరకు విచారణకు శ్రీకారం చుట్టారు. అనంతపురం నగరపాలకలో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన సౌకర్యాలు అందకుండా ఉండటంపై జనవరి 17న ‘పరికరం ఇలా.. పారిశుద్ధ్యం ఎలా?’, 23న ‘అందని సాయం... దయనీయ జీవనం’, 26న ‘చిత్తగిస్తేనే.. చెత్త తీసుకెళ్తాం!’, ఫిబ్రవరి 1న ‘కాగితాల్లోనే.. పారిశుద్ధ్య పరికరాలు’ శీర్షికలతో కథనాలు ప్రచురితం అయ్యాయి. కార్మికులకు అందాల్సిన ఈపీఎఫ్‌ 2012 నుంచి అప్కోస్‌ ఏర్పాటు అయ్యే వరకు ఉన్న వివరాలను పరిశీలించాలని దిల్లీలోని కార్యాలయం నుంచి కడప బ్రాంచికి సమాచారం అందింది. దీంతో అనంతపురానికి సంబంధించిన ఎన్‌ఫోర్సుమెంట్‌ కమిషనరు శ్రీనివాసనాయక్‌తో పాటు ముగ్గురు సిబ్బంది వివరాలను పరిశీలించారు. సుమారు 32మంది వరకు మృతి చెందిన కార్మికులకు రూ.10కోట్ల వరకు వేతనాల నుంచి మినహాయించుకొని ఇప్పటి దాకా జాప్యం జరిగినట్లు గుర్తించారు. అన్ని వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. సోమవారం నగరపాలకలో కమిషనరు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మేలోపు కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. కార్మికులకు పరికరాలను తక్షణమే ఇవ్వాలని, లేనిపక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని