logo

యాంత్రీకరణతో రైతన్నకు తగ్గనున్న పెట్టుబడి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న యాంత్రీకరణ వ్యవసాయ సేవలతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 03:14 IST

పరికరాలు అందజేస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎంపీ, ఎమ్మెల్సీ తదితరులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న యాంత్రీకరణ వ్యవసాయ సేవలతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ క్రీడా మైదానంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యంత్ర సేవా పథకం మెగా మేళా-2 కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 234 రైతు గ్రూపులకు రూ.5.485 కోట్లు రాయితీతో 137 ట్రాక్టర్లు, 448 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఆర్బీకేల పరిధిలో 10 నుంచి 15 మంది రైతులతో గ్రూపులుగా ఏర్పాటు చేసి, యంత్ర సేవా కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయమన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే యంత్ర పరికరాల కొనుగోలుకు బ్యాంకు రుణాన్ని రాయితీతో అందజేస్తామన్నారు. ఆర్బీకేల ద్వారా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు అందిస్తున్నామన్నారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఉందని, రైతులు యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యంత్రసేవా పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని