logo

15 మంది వాలంటీర్లు.. ముగ్గురు మున్సిపల్‌ సిబ్బంది తొలగింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) ఉల్లంఘించే ప్రభుత్వ సిబ్బందిపై కలెక్టర్‌ గౌతమి చర్యలు చేపట్టారు. ఆర్‌ఓలతో నివేదికలు తెప్పించుకుని వేటు వేస్తున్నారు.

Published : 27 Mar 2024 04:50 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) ఉల్లంఘించే ప్రభుత్వ సిబ్బందిపై కలెక్టర్‌ గౌతమి చర్యలు చేపట్టారు. ఆర్‌ఓలతో నివేదికలు తెప్పించుకుని వేటు వేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 18 మందిని విధుల నుంచి తొలగించారు. వీరందరూ అధికార వైకాపా తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాటిపై ‘ఈనాడు’ లో కథనాలు రావడంతో 15 మంది వాలంటీర్లు, ముగ్గురు మున్సిపల్‌ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారిలో రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం డి.హోన్నూరుకు చెందిన వాలంటీర్లు వన్నూరుస్వామి, వన్నేస్‌, భీమన్న, బంగి వన్నూరుస్వామి, శరణ బసవ, హనుమంతు, మోక నాగరాజు, భాస్కర్‌, అడివప్పగారి ప్రసాద్‌, గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని గుత్తి పట్టణానికి చెందిన వాలంటీర్లు దివాకర్‌, మహమ్మద్‌నవీద్‌ , నసీˆర్‌ హుస్సేన్‌, దాదా ఖలందర్‌, రాజేశ్‌బాబు, పెనుకొండ షానవాజ్‌ఖాన్‌ ఉన్నారు. తాడిపత్రి పురపాలికకు చెందిన ఒప్పంద ఉద్యోగులు ఆర్‌.రామరాజు, వి.వెంకటరమణ, జి.మధుసూదన్‌రెడ్డిపైనా వేటు వేశారు. ఇప్పటి దాకా విధుల నుంచి తొలగించిన వారిలో వాలంటీర్లు 36 మంది, రేషన్‌డీలర్లు ఐదుగురు, ఒప్పంద ఉద్యోగులు ఏడుగురు, రెగ్యులర్‌ ఉద్యోగి ఒకరు ఉన్నారు.

సి విజిల్‌కు పది ఫిర్యాదులు

కోడ్‌ ఉల్లంఘనపై సి విజిల్‌ యాప్‌నకు మంగళవారం పది ఫిర్యాదులు అందాయి. జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూంకు రెండు, ఉరవకొండ ప్రాంతం నుంచి నాలుగు, గుంతకల్లు నుంచి రెండు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నుంచి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ఆ ఫిర్యాదులను పరిష్కరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటి దాకా సి విజిల్‌కు 191 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. మరో వైపు పోస్టర్లు 7025, బ్యానర్లు 3132, గోడలపై రాతలు 812 తొలగించగా.. జిల్లా వ్యాప్తంగా 4060 ప్రాంతాల్లో నాయకుల చిత్రాలు, విగ్రహాలపై వస్త్రాలను కప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని