logo

జగన్‌ .. ఇంకా పరిహారం ఇవ్వలే

భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను.

Published : 24 Apr 2024 05:15 IST

భూ నిర్వాసితుల ఎదురుచూపులు
అంగుళం కూడా జరగని బీటీపీ కాలువ పనులు

మందలపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనులు

భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను.

2023 జులై 8వ తేదీ కళ్యాణదుర్గంలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్‌

కళ్యాణదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని గత తెదేపా ప్రభుత్వం జీడిపల్లి- భైరవానితిప్ప- కుందుర్పి ఎత్తిపోతల పథకం కాలువ పనులు ప్రారంభించింది. జీడిపల్లి జలాశయం నుంచి కాలువ ద్వారా నీటిని తీసుకువచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులు, రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తరలించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. 2018 సంవత్సరం చివర్లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కళ్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద రూ.968కోట్ల వ్యయంతో కాలువ పనులు ప్రారంభించారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి జీడిపల్లి నుంచి కృష్ణాజలాలు తీసుకువస్తామని ఆర్భాట ప్రకటనలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. ఉష శ్రీచరణ్‌ పదువులు అలంకరించారే తప్ప పనులపై శ్రద్ధ చూపలేదు.

ఇచ్చింది రూ.78కోట్లే..

కాలువ పనులకు 1,406 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలోనే సేకరించి పెట్టారు. రైతులకు పరిహారం అందకపోయినా సాగు జలాలు వస్తే చాలని స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చారు. ఆ భూముల్లో 25 శాతం మట్టి పనులు చేసి కాలువ తవ్వారు. ఆ భూములకు సంబంధించి ఇప్పటి వరకు వందలాది మంది రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.

గతేడాది సీఎం రూ.208కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పి.. రూ.135కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.80కోట్లు రైతులకు పరిహారం కాగ మరో రూ.55కోట్లు సివిల్‌ వర్కులకు కేటాయించారు. 1,406 ఎకరాలకుగాను 789 ఎకరాలకు రూ.78కోట్లు పరిహారం ఇచ్చారు. ఇంకా 620ఎకరాలకు పరిహారం రావాల్సి ఉంది. సివిల్‌ పనుల్లో కేవలం ఐదు కిలోమీటర్లు కాలువ పనులు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి కమీషన్లకు కక్కుర్తి పడటంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.

నేటీకీ అందలేదు

బీటీపీ కాలువ పనులకు నా పేరు మీద సర్వే నంబర్‌ 331, 132లో 2.70 ఎకరాల భూమి పొంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి చెప్పారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఎనిమిది నెలల క్రితం పరిహారం ఇస్తామని అధికారులు పాసు పుస్తకాలు తీసుకున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చారు. పరిహారం వస్తుందని అప్పులు చేసుకుని అవస్థ పడుతున్నా.

పాలక్షి, మందలపల్లి, కుందుర్పి మండలం

హమాలీ పని చేసి బతుకుతున్నా..

మా నాన్న మర్రిస్వామి పేరున ఉన్న 2.50ఎకరాల భూమి కాలువకు ప్రభుత్వం తీసుకుంది. భూమి పోయి ఉపాధి లేక బెంగళూరుకు వెళ్లి హమాలీ పని చేసుకుంటున్నా. భూమి ఇచ్చిన రైతులకు పరిహారం ఇస్తామని ఎనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కళ్యాణదుర్గంలో ప్రకటిస్తే బెంగళూరులో ఉపాధి వదిలి గ్రామానికి వచ్చాను. ఇప్పుడు ఉపాధి పోయింది, అప్పులు మీదపడ్డాయి. నేటికీ పరిహారం రాలేదు. జీవనం కష్టంగా మారింది.

నాగరాజు, అపిలేపల్లి, కుందుర్పి మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని