logo

కూలీకో కథ.. దీనగాథ

కూటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు.. వలస కూలీలు. బతుకుదెరువు కోసం జిల్లాల సరిహద్దులు దాటి తిరుపతి చేరుకున్న వేలాది మంది వలస కార్మికులు నగరంలోని పలు కూడళ్లలో తెల్లవారుజాము నుంచే కనిపిస్తుంటారు. నగరపాలిక కార్యాలయం

Published : 29 Jun 2022 02:24 IST

బతుకుదెరువు కోసం తిరుపతికి వలస
న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక)

కూటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు.. వలస కూలీలు. బతుకుదెరువు కోసం జిల్లాల సరిహద్దులు దాటి తిరుపతి చేరుకున్న వేలాది మంది వలస కార్మికులు నగరంలోని పలు కూడళ్లలో తెల్లవారుజాము నుంచే కనిపిస్తుంటారు. నగరపాలిక కార్యాలయం కూడలి, జీవకోన అంబేడ్కర్‌ విగ్రహం, లీలామహల్‌, ముత్యాలరెడ్డిపల్లె కూడలి, వైకుంఠపురం వద్ద ఉదయం ఆరు గంటలకే గుంపులుగా చేరి ఉపాధి కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. రోడ్డు మీద వెళ్లే వారు ఎవరైనా వాహనాన్ని ఆపినా.. వేగం తగ్గించినా తమ వైపు చూసినా ఆశతో వారిని చుట్టుముట్టి పనికి వస్తామంటూ ప్రాధేయపడతారు. పనిదొరికితే ఆశతో వెళ్లేవారు కొందరైతే.. మధ్యాహ్నం వరకు పని దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో ఎదురుచూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు ఇంకొందరు. వలస కార్మికులను కలిదిస్తే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ.


ఊరిలో కూలి చేయడం అవమానంగా భావించి..

- కేశవులు, ప్రొద్దుటూరు

మా ఊరిలో ఉదయం, మధ్యాహ్నం భోజనం పెట్టి రోజూ రూ.800 కూలి ఇస్తారు. రోజూ పని ఉంటుంది. వ్యవసాయం చేసి బాగా బతికిన ఊరిలో కూలి చేయడం అవమానంగా భావించి ఇక్కడికి వచ్చేశాం. ఇక్కడ కూడా అన్నం పెట్టకుండా రోజుకు రూ.800 ఇస్తారు. ఇంటి కట్టడం పనులు తప్ప ఇతర పనులు దొరకవు. సిమెంట్‌, ఇటుక, ఇసుక, కమ్మి రేటు పెరగడంతో పనులు తగ్గిపోయాయి. ఊరిలో పనిచేయలేక, కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ తప్పవని కష్టాలు భరిస్తున్నాం.


ఏడాదికి ఒక్కసారే ఊరికి..

- భార్గవ్‌, ప్రకాశం జిల్లా

ఉపాధి కోసం కుటుంబం మొత్తం ఇక్కడికే వచ్చేశాం. నేను, నా కొడుకు కట్టడాల పనికి పోతాం. భార్య బత్తాయి రసం అమ్మే బండి పెట్టుకుంది. ఉదయమే భోజనం సిద్ధం చేసుకుని వచ్చేసి తిరిగి రాత్రి ఇంటికి చేరుతాం. ఊరిలో జరిగే పండుగలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటాం. ఏడాదికి ఒకసారి ఊరిలో జరిగే జాతరకు వెళ్లి వారం రోజులు ఉంటాము. ముగ్గురు కష్టపడితేనే కుటుంబం గడవని పరిస్థితి మాది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.


వ్యవసాయంలో అప్పులు చేసి..

- నాగేంద్ర, కదిరి

ఊరిలో సేద్యం సక్రమంగా జరగడం లేదు. నాలుగైదు సంవత్సరాలు వరుసగా పంటలు చేతికి రాకపోవడంతో అప్పులపాలయ్యాం. అక్కడే ఉంటే అప్పులు తీర్చలేమని తలచి తిరుపతికి వచ్చేశారు. మా గ్రామంలో సగం మంది ఇక్కడే పనులు చేసుకుంటూ వడ్డీలు చెల్లిస్తున్నాం. ఎక్కడైనా మేమే పనులు ఒప్పుకొని రాత్రింబవళ్లు చేసి నాలుగు రూకలు సంపాదించుకుంటున్నాం. బంధువులే కావడంతో అప్పు ఎక్కువగా ఉన్నవారికి ముందు ఇచ్చేస్తున్నాం. నాలుగైదేళ్లు ఇలాగే కష్టపడితే అప్పులు తీర్చి తలెత్తుకుని ఊరికి వెళ్లే పరిస్థితి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని