logo

పండుటాకులకు ఆశ్రమం

ముదిమి వయసులో బిడ్డల నిరాదరణకు గురైనవారు కొందరు, ఆస్తి ఇవ్వలేదని పిల్లలు పట్టించుకోని వారు మరికొందరు.. ఇలా ఎందరో వృద్ధుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తోంది తెలుగుతల్లి వృద్ధాశ్రమం.

Published : 29 Jun 2022 02:24 IST

ఆశ్రమంలో సేదతీరుతున్న వృద్ధులు

పుంగనూరు, న్యూస్‌టుడే: ముదిమి వయసులో బిడ్డల నిరాదరణకు గురైనవారు కొందరు, ఆస్తి ఇవ్వలేదని పిల్లలు పట్టించుకోని వారు మరికొందరు.. ఇలా ఎందరో వృద్ధుల కన్నీళ్లు తుడుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తోంది తెలుగుతల్లి వృద్ధాశ్రమం. జీవితంలో అలసిన మనుషులకు సాంత్వన చేకూరుస్తోంది.

* పట్టణానికి చెందిన గాజుల నటరాజ, రేవతిలకు ఇద్దరు కుమారులు. ఇక్కడ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో 15 ఏళ్ల కిందట బెంగళూరు వెళ్లి చిరు వ్యాపారాలు చేశారు. 2008లో వారి చిన్న కుమారుడు విష్ణువర్ధన్‌ ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో సొంతూరైన పుంగనూరు వచ్చేశారు. నటరాజకు తెలుగుబాషపై మక్కువ ఎక్కువ. కుమారుడి జ్ఞాపకార్థం ఆ దంపతులు 2016లో పుంగనూరులో తెలుగుతల్లి వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. తమ సొంత భూమిలోనే కొన్ని షెడ్లు వేసుకుని వృద్ధులకు ఆశ్రయం కల్పించడం ప్రారంభించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పట్టణవాసులే గాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరాదరణకు గురైన వారు ఇక్కడ చేరారు. తమ సొంత నిధులతోనే మూడు పూటలా భోజనం అందిస్తూ ఆశ్రయం కల్పించారు. వారి సేవను గుర్తించి కొందరు దాతలు షెడ్లు, ఇతర వసతుల కల్పనకు ముందుకొచ్చారు. జన్మదినాలు, వర్ధంతులు, జయంతుల రోజున ఇక్కడ దాతలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.

కరోనా సమయంలోనూ సేవలు: వీరు పుంగనూరుతో పాటు తిరుపతిలోనూ ఆశ్రమాన్ని ప్రారంభించారు. వీరి సేవలను గుర్తించి ఓ దాత పాకాలలో ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. మూడు ప్రాంతాల్లో 120 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. కరోనా సమయంలో సైతం ఆశ్రమాలు కొనసాగాయి. ఎప్పటికప్పుడు వైద్యసేవలు, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, ఎవరి నుంచి ఆశించకుండా ఆశ్రమం నడుపుతుండటంతో దాతలే నేరుగా ఆశ్రమానికి వచ్చి పండ్లు, దుస్తులు, భోజనం అందిస్తున్నారు. దాతల సాయం అందని రోజుల్లో వ్యక్తిగతంగా వెచ్చిస్తున్నారు. ఆశ్రమంలో వయస్సు మీరి మృతి చెందిన 40 మందికి ఆశ్రమ నిర్వాహకులే అంత్యక్రియలు చేశారు.


పుట్టుకతోనే కంటిచూపు లేదు

నా పేరు లక్ష్మీదేవమ్మ. చిన్నప్పటి నుంచే కంటి చూపులేకపోవడంతో పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులు, సోదరుని ద్వారా పోషణ సాగేది. పదేళ్ల కిందట తల్లిదండ్రులు, ఐదేళ్ల కిందట సోదరుడు మృతి చెందారు. దీంతో బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లడం ఇష్టంలేక ఇక్కడ ఆశ్రమం ఉందన్న సమాచారం తెలుసుకుని వచ్చేశా. అయిదన్నరేళ్లుగా ఆశ్రయం పొందుతున్నా. నాలాంటి వారికి ఇది దేవాలయం లాంటిది.


సంతోషంగా ఉంది

నా పేరు మరియమ్మ. పిల్లల ఆదరణ లేక ఇంటి వద్ద ఇబ్బందిపడుతుంటే మాకు తెలిసిన ఒకాయన నన్ను ఇక్కడకు తెచ్చారు. చేరిన నాటి నుంచి మూడు పూటలా కడపార తింటూ..ఆశ్రమంలోనే సేదతీరుతున్నా. పడకలు, దుస్తులు, మరుగుదొడ్లు తదితర వసతులు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఇంటి దగ్గర కంటే ఇక్కడే సంతోషంగా ఉంది.


నా చిన్న నాటి కల
- రేవతి, అధ్యక్షురాలు, తెలుగుతల్లి వృద్ధాశ్రమం

ప్పలాయగుంటలో మా సొంత భూమిలో 500 మంది అనాథలకు సరిపడే స్థాయిలో ఆశ్రమం నిర్మిస్తున్నాం. నా చిన్ననాటి కల అనాథాశ్రమం ఏర్పాటు. ఇప్పటికి నెరవేరుతోంది. పడకలో గల వృద్ధులను చూసుకోవడానికి ఎక్కడా సరైన వసతులు లేవు. వారికి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచే కాకుండా చెన్నై, బెంగళూరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు ఆశ్రయం పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని