logo

పగటి వెలుగు.. ప్రగతికి చేటు

పల్లెలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అతిపెద్ద సమస్యగా మారింది. స్విచ్‌బోర్డులు లేక విలువైన విద్యుత్తు వృథా అవుతుండగా బల్బుల సామర్థ్యం సైతం తగ్గిపోతోంది. సగానికి పైగా పల్లెల్లో బల్బులు పగలు సైతం వెలుగుతున్నాయి..

Published : 29 Jun 2022 03:03 IST
నిధుల్లేక పంచాయతీల నిట్టూర్పు
స్విచ్‌బోర్డుల ఏర్పాటులో తీవ్ర జాప్యం
అర్ధమాలలో పగలు వెలుగుతున్న వీధి దీపం

పల్లెలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అతిపెద్ద సమస్యగా మారింది. స్విచ్‌బోర్డులు లేక విలువైన విద్యుత్తు వృథా అవుతుండగా బల్బుల సామర్థ్యం సైతం తగ్గిపోతోంది. సగానికి పైగా పల్లెల్లో బల్బులు పగలు సైతం వెలుగుతున్నాయి.. వీటితో ప్రతినెలా రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడుతున్నట్లు అంచనా. పట్టణాల్లో పేరుకుపోయిన బకాయిలు రూ.లక్షల్లో ఉండగా ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న పంచాయతీలకు విద్యుత్తు బిల్లులు గుదిబండగా మారాయి. ఆర్థిక సంఘం నిధులు సర్దుబాటు చేస్తుండటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూడూరు, న్యూస్‌టుడే : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీధి దీపాలు 18,530 ఉండగా వీటికి 25,812.23 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. కనెక్షన్‌కు 402.67 యూనిట్ల చొప్పున ప్రతిరోజూ 74,61,475.1 యూనిట్లు వాడుతున్నారు. కేటగిరి 4ఎ కింద వీధి దీపాల టారిఫ్‌ లెక్కిస్తారు. అంటే రోజుకు యూనిట్‌ రూ.7 లెక్కన రూ.5.22 కోట్లు, నెలకు సరాసరి రూ.156.69 కోట్లు వీధి దీపాలకు స్థానిక సంస్థలు చెల్లించాల్సి వస్తోంది.

స్విచ్‌లదే ప్రధాన సమస్య

పల్లెల్లో చాలాచోట్ల ఆన్‌-ఆఫ్‌ స్విచ్‌లు లేకపోవడంతో రాత్రీపగలు వీధీ దీపాలు వెలుగుతున్నాయి. దీంతో బిల్లులు తడిసి మోపెడువుతున్నాయి. వేసవిలో కరెంట్‌ కోసం అష్టకష్టాలుపడ్డ విద్యుత్తు సంస్థలకు కొన్ని రోజులు సరఫరా ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ సమయంలోనూ వీధి దీపాల పగటి వెలుగులు కన్పించడం గమనార్హం. మీట ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలది కాగా చాలాచోట్ల గాలికి వదిలేశారు. నిధుల లేమితో కొత్తవి బిగించే పరిస్థితి లేదు. వీటికోసం ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత విద్యుత్తు సంస్థలపై ఉంది. గతంలో ఉన్న స్తంభాలకు దీపాలు బిగించి వాడుతున్నారు. మరో లైన్‌ వేస్తే మీటల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని స్థానికసంస్థలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిర్వహణ బాధ్యత గతంలో ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంతో వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించేవారు. ప్రభుత్వం మారాక ఆ బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలు చూస్తున్నా ఇక్కడ వీధి దీపాలు కొత్తగా వేసే పరిస్థితి లేదు. బల్బులు కావాలని అడుగుతున్న కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. నిధుల లేమే దీనికి ప్రధాన కారణం.

ఇలాంటి స్విచ్‌బోర్డుల ఏర్పాటెక్కడ

బిల్లుల భారం ఇలా..

చంద్రగిరి మండలంలో 434 వీధి దీపాలు ఉన్నాయి. వీటికి 554.36 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తుండగా యూనిట్‌కు రూ.7 చొప్పున నెలకు రూ.12.51 లక్షలు ఈ మండలం నుంచి వీధి దీపాలకు చెల్లించాల్సి ఉంది.

వెంకటగిరి పురపాలిక, గ్రామీణ పరిధిలో 301 వీధి దీపాలు ఉండగా 273 కిలోవాట్ల విద్యుత్తు వాడుతున్నారు. నెలకు సరాసరి ఒక్కో కనెక్షన్‌కు 2,242 యూనిట్ల వినియోగం జరుగుతుండగా పురపాలికతోపాటు పంచాయతీలు కలిపి రూ.47.23 లక్షలను వీధి దీపాల బిల్లులకు చెల్లించాల్సి వస్తోంది.

నాయుడుపేట మండలం, పట్టణ పరిధిలో 308 వీధి దీపాలు ఉన్నాయి. 390 కిలోవాట్ల విద్యుత్తు వాడకం ఉంది. ఇందుకోసం రూ.40.40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఏర్పాటుకు ఆదేశాలిచ్చాం - వెంకటరమణ, డీఎల్‌పీవో, గూడూరు

పంచాయతీల్లో స్విచ్‌బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలిచ్చాం. వీధి దీపాల నిర్వహణ బాధ్యత సచివాలయ సిబ్బందిపైనా ఉంది. కొన్నిచోట్ల వీధి దీపాలకు ప్రత్యేక లైన్‌ లేకపోవడం సమస్యగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని