logo

ఉన్నతి.. సేవానిరతి

ఒకప్పుడు కూతురంటే చిన్నచూపు. మగపిల్లలపై చూపిన ప్రేమ ఆడపిల్లలపై ఉండేది కాదు. పరిస్థితులు మారాయి. కంటే కూతుర్నే కనాలి అన్నట్లు సమాజం మారింది. కుమారులతో సమానంగా కుటుంబ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు.

Updated : 25 Sep 2022 04:20 IST

నేడు కుమార్తెల దినోత్సవం

ఒకప్పుడు కూతురంటే చిన్నచూపు. మగపిల్లలపై చూపిన ప్రేమ ఆడపిల్లలపై ఉండేది కాదు. పరిస్థితులు మారాయి. కంటే కూతుర్నే కనాలి అన్నట్లు సమాజం మారింది. కుమారులతో సమానంగా కుటుంబ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఉన్నత స్థితికి కారణమైన తల్లిదండ్రులు అండగా నిలుస్తూ.. బాగోగులు చూడటంతోపాటు వారి సేవలు కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకొందరు సోదరులకు చేయూతనిస్తున్నారు.
- న్యూస్‌టుడే, తిరుపతి(విద్య), శ్రీకాళహస్తి, పుత్తూరు, ఏర్పేడు, గంగాధర నెల్లూరు


ఆశయ బాట..  ఆప్యాయతల పూదోట

తండ్రి బలరామయ్యతో సృజన

తండ్రి బాటలో నడుస్తూ.. ఆయన చేస్తున్న సామాజిక సేవలు కొనసాగిస్తున్నారు.. తొట్టంబేడు మండలం పూడి పంచాయతీకి చెందిన ఐఏఎస్‌ అధికారిణి సృజన. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమె.. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బలరామయ్య, సుగుణశీల కుమార్తె. తండ్రి ప్రోత్సాహంతో ఐఏఎస్‌ అయిన ఆమె.. సమాజ సేవ, లలిత కళల ఆదరణ విషయంలో తండ్రికి వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు పది రోజుల ముందే స్వగ్రామం పూడికి వచ్చేస్తారు. గ్రామంలోని పిల్లలు, యువత, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ చూసిన వారికి బహుమతులు అందజేస్తారు. పౌరాణిక నాటకాలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇవన్నీ తండ్రి బలరామయ్య చేసేవారు. సృజన తన భుజస్కంధాలపై వేసుకుని తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందారు. ఈమె భర్త రవితేజ హైకోర్టు న్యాయవాది.


అన్న కుటుంబానికి అండ

కుమార్తె శ్రీజతో పద్మావతి

గూడూరుకు చెందిన రామమ్మ, రమణయ్య దంపతుల కుమారై పద్మావతి. తండ్రి రమణయ్య ప్రైవేటు ఉద్యోగి. తల్లి రామమ్మ నిరక్షరాస్యురాలు. కుమారులతో పాటు కుమారైను చదివించారు. చిన్ననాటి నుంచి విద్యపై పద్మావతి మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 1998లో ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్‌ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. భర్త హరీంద్రనాథ్‌ తితిదేలో ఆర్‌1లో డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. తన ఉన్నతికి కారణమైన తల్లిదండ్రుల బాగోగులు చూశారు. అనారోగ్యం చేయడంతో వారు చనిపోయేవరకు అన్నీ తానై సపర్యలు చేసింది. అన్న చనిపోవడంతో ఆయన కుటుంబం కష్టాల్లో చిక్కుకుంది. కుటుంబ బాధ్యతలు కొంతవరకు తన భుజస్కంధాలపై వేసుకుంది. పిల్లల చదువులకు చేయూతనిస్తోంది.


అమ్మకు ఆసరా..

ఏర్పేడు మండలం మునగలపాళెంకు చెందిన రత్నమాల, నాగేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె నవ్య. తండ్రి దూరమైనా అమ్మకు అండగా ఉంటోంది. తల్లిదండ్రులు నవ్యను ఎంటెక్‌ వరకు చదివించి... బంగారుపాళ్యానికి చెందిన రామకృష్ణతో పదేళ్ల కిందట వివాహం జరిపించారు. 2016లో ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి నాగేశ్వరరావు మృతి చెందంతో తల్లి రత్నమాల ఒంటరిగా మిగిలారు. తల్లి బాధ్యతలు కుమార్తె నవ్య తీసుకుంది. కుటుంబానికి పెద్దదిక్కై తల్లి ఆలనాపాలన చూస్తున్నారు. కొన్నేళ్లపాటు అమ్మకు తోడుగా ఉంటూ జీవనం సాగించారు. ఉద్యోగరీత్యా మూడేళ్ల కిందట భర్తతో కలిసి దుబాయిలో స్థిరపడినా తల్లి బాగోగులు చూస్తూ స్ఫూర్తిగా నిలిచింది.. నవ్య.


 కంటే కూతుర్లనే కనాలనేలా..

జయలక్ష్మి, లీలావతి, త్రివేణి, మల్లిక

గంగాధరనెల్లూరు మండలం కలిజవేడు పంచాయతీ బొమ్మవారిపల్లెకు చెందిన చిన్నకారు రైతు రాజేంద్ర నాయుడుకు నలుగురు కుమార్తెలు. కొడుకు పుట్టలేదని మొదట బాధ అనిపించినా కుమార్తెలు జయలక్ష్మి, లీలావతి, త్రివేణి, మల్లికను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకున్నారు. చదివించే స్తోమత లేకపోవడంతో వారిని చదివించడం ఎందుకని బంధుమిత్రులన్నారు. వీరు నలుగురు ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివి అత్యుత్తమంగా రాణించారు. జయలక్ష్మి ఎంబీఏ, లీలావతి బీటెక్‌, త్రివేణి బీటెక్‌, మల్లిక బీటెక్‌ చదివి హైదరాబాద్‌, బెంగళూరులో ఆకర్షణీయమైన వేతనాలతో ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి మరణానంతరం.. క్రమశిక్షణతో మెలుగుతూ తమ వేతనాన్ని తల్లికి ఇస్తూ.. పక్కాఇల్లు నిర్మించడంతో పాటు తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కుమారుడు పుట్టలేదన్న బాధను వీరి చదువు, ప్రవర్తన, నడవడికతో తీరిందని తల్లులు వాణి, శారద అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని