logo

పర్యాటకం.. ఎటో నీ పయనం?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు వేశారు.

Published : 07 Dec 2022 01:32 IST

స్వదేశ్‌ దర్శన్‌పై ముందుకు పడని అడుగులు

ఉమ్మడి జిల్లాలో ఇదీ దైన్యం

ఈనాడు - తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు వేశారు.. నిధులూ వచ్చాయి.. రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం కానరావడం లేదు. నిధులను సకాలంలో వ్యయం చేయించాలన్న కృతనిశ్చయం లేక.. పనులు ఎందుకు ఆగాయో సమీక్షించేవారు కానరాక.. ఆయా ప్రాంతాలకు వెళ్లిన సందర్శకులు సరైన వసతులు లేక అల్లాడుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. కొత్త ప్రతిపాదనలు అటుంచి.. కేంద్రం స్వదేశ్‌ దర్శన్‌ పేరిట విడుదల చేసిన నిధులపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.

ఉమ్మడి జిల్లాకు వచ్చే సందర్శకుల్లో అత్యధిక మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వీరిని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ఆకర్షిస్తే  స్థానిక ప్రజల జీవనోపాధులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.


తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో ఏడు ప్రాంతాలను స్వదేశీ దర్శన్‌ కింద  అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. వాటి పరిస్థితి ఎలా ఉందంటే..

పని: పర్యాటక భవన్‌ నిర్మాణం

ఎక్కడ: తిరుపతి రుయా ఆసుపత్రి ఎదురుగా.

కేటాయింపు: రూ.5 కోట్లు

ప్రస్తుత స్థితి: పనులు మధ్యలో ఆగాయి.

ప్రయోజనం: ఇది పూర్తయితే గదుల కేటాయింపు ద్వారా ఆదాయం పొందొచ్చు. శ్రీవారి భక్తులకు వసతి సమస్య తీర్చొచ్చు.

పని: సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అభివృద్ధి

ఎక్కడ: కుప్పం ప్రాంతం గుడివంకలో

కేటాయింపు: రూ.5 కోట్లు

ప్రస్తుత పరిస్థితి: కొంత మెట్ల దారి, గుడి పునర్నిర్మించారు.

పని: పర్యాటకులకు సదుపాయాల కల్పన

ఎక్కడ: గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయం వద్ద

కేటాయింపు: రూ.కోటి

ప్రస్తుత స్థితి: పనులు ముందుకు సాగలేదు.


వివాదాల పరిష్కారంలోనూ..

పర్యాటకశాఖ వివాదాలు పరిష్కరించే విషయంలోనూ దృష్టిసారించట్లేదన్న విమర్శలున్నాయి.   అలిపిరి వద్ద దేవలోక్‌ పేరుతో ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి పర్యాటక శాఖకు చెందిన 38 ఎకరాలను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఈ ప్రాజెక్టును ఆ తర్వాత పక్కన పెట్టడంతో గుత్తేదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటి వరకు సమస్య పరిష్కారానికి నోచలేదు.

ఏర్పేడులో పర్యాటక విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన దశ దాటలేదు.

వెంకటాపురం చెరువును ఎకో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి,  కృష్ణాపురం, అరణియార్‌ జలాశయాల్లో బోటింగ్‌కు అడుగులు పడలేదు.


దృష్టి సారిస్తున్నాం

జిల్లాల పునర్విభజన తర్వాత ఎక్కడెక్కడ పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయనే అంశంపై దృష్టిసారించాం. ఈ నెల 12న జిల్లా పర్యాటక అభివృద్ధిపై సమీక్షించనున్నాం. ఇందులో ఎక్కడెక్కడ పనులు చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం.

రూపేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని