logo

ఉత్సవంలో ఉద్యోగులకు గాయాలు

కార్తికం.. కృత్తిక నక్షత్రం సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించిన చొక్కాణి ఉత్సవం చివరలో గందరగోళంగా మారింది.

Published : 07 Dec 2022 01:32 IST

భద్రతా ఉద్యోగిని శ్రీదేవిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్న సిబ్బంది

శ్రీకాళహస్తి: కార్తికం.. కృత్తిక నక్షత్రం సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించిన చొక్కాణి ఉత్సవం చివరలో గందరగోళంగా మారింది. ఎగసిపడ్డ మంటలతో భక్తులు పరుగులు తీశారు. కార్తికం, కృత్తికా నక్షత్రం సందర్భంగా ముక్కంటి ఆలయంలో మంగళవారం రాత్రి చొక్కాని ఉత్సవాన్ని జరిపారు. ఉత్సవం ఆఖరులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటం, భక్తులు దగ్గరలోనే ఉండటంతో ఆ మంటల తీవ్రతకు ఆర్తనాదాలతో కేకలు వేశారు. పరుగులు పెట్టడంతో పాటు ఒకరిపై ఒకరు పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ తొక్కిసలాటల్లో పలువురు భద్రతా ఉద్యోగినిలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు, సిబ్బంది తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. నిప్పుకణికలు భక్తులపై పడటం, ఓ ప్రణాళిక లేకుండా చొక్కాని మానును వెలిగించడం కారణంగా ప్రమాదాలు తలెత్తాయి. రూ.750 రాహు, కేతు మండపంపై నిప్పురవ్వలు పడటంతో భద్రతా సిబ్బంది వాటిని ఆర్పివేశారు.

రూ.750 మండపంపై మంటలను అదుపు చేస్తున్న భద్రతా సిబ్బంది

అందరూ వీఐపీలే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇటీవల కాలంలో ఏదైనా ఉత్సవం జరిగితే వీఐపీలు ఎక్కువైపోతున్నారు. అవసరానికి తగ్గట్టుగా భద్రతా ఉద్యోగులను నియమించినా చొక్కాని మాను చుట్టూ ఎవరిని బయటకు పంపించాలన్నా అందరూ వీఐపీలు, వాళ్ల బినామీలు కావడంతో సెక్యురిటీ ఉద్యోగులు తమకెందుకులే అన్న విధంగా మిన్నకుండిపోయారు. ఇదే కారణంగా ప్రమాదం తలెత్తడంతో వీఐపీల వెనుక ఉన్న భక్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గాయాలైన క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించారు. ఆలయ ఛైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి గాయాలకు గురైన వాళ్ల పరిస్థితులను తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని