logo

తండ్రి మృతదేహం వెతికేందుకెళ్లి కుమారుడి మృతి

చెరువులో పడి తండ్రీ కుమారుడు మృతిచెందిన విషాద ఘటన ఓజిలి మండలంలో మంగళవారం వెలుగుచూసింది.

Published : 07 Dec 2022 01:32 IST

ఓజిలి మండలంలో విషాదం

ఓజిలి, న్యూస్‌టుడే: చెరువులో పడి తండ్రీ కుమారుడు మృతిచెందిన విషాద ఘటన ఓజిలి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రద్దగుంట గ్రామానికి చెందిన అలిమిలి చెంగయ్య (62) వ్యవసాయంతోపాటు పాడిగేదెలతో జీవనం సాగించేవారు. భార్య, ఇద్దరు కుమారులు సంతానం. సోమవారం ఉదయం గేదెలను మేతకు తీసుకువెళ్లిన అతను సాయంత్రం వాటిని శుభ్రం చేసేందుకు స్థానిక చెరువులో దిగారు. ఈ క్రమంలో కాలుజారి పడిపోవడంతో గల్లంతయ్యారు. గేదెలు మాత్రం యథావిధిగా ఇంటికి చేరుకున్నాయి. చెంగయ్య రాత్రవుతున్నా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గొర్రెల కాపరులను విచారించారు. వారు చెరువు వద్దకు వెళ్లినట్లు చెప్పడంతో అక్కడికి చేరుకుని గాలించారు. ఎంతకూ కనిపించకపోవడంతో బెంగళూరులో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న కుమారుడు నాగార్జున (32)కు సమాచారం ఇచ్చారు. అతను తెల్లవారు జామున స్వగ్రామానికి చేరుకున్నాడు. తండ్రి కోసం చెరువులోకి దిగిన అతను కొద్దిసేపటికే ఈదడం సాధ్యం కాక మునిగిపోయాడు. వెంట వెళ్లిన గ్రామస్థులు కాపాడేందుకు చేసిన యత్నం ఫలించలేదు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, పోలీసుల సహకారంతో మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. నాగార్జునకు పదేళ్లలోపు ఇద్దరు మగపిల్లలు, భార్య ఉన్నారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓజిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని