logo

యుగళం ప్రతిధ్వనించాలని

పరిశ్రమలు రాక నిరుద్యోగ యువతకు ఉపాధి కరవు.. గ్రామాల్లో వలస బాట.. మూడున్నరేళ్లు గడిచినా నోటిఫికేషన్ల జారీలో జాప్యం.. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీటి సమస్య.

Published : 27 Jan 2023 02:35 IST

లోకేశ్‌ తొలి అడుగుకు కుప్పం సిద్ధం
పాదయాత్రగా ప్రజలతో మమేకం కానున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఈనాడు-తిరుపతి, కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పరిశ్రమలు రాక నిరుద్యోగ యువతకు ఉపాధి కరవు.. గ్రామాల్లో వలస బాట.. మూడున్నరేళ్లు గడిచినా నోటిఫికేషన్ల జారీలో జాప్యం.. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీటి సమస్య.. రాష్ట్ర రాజధాని అమరావతిపై నిర్లక్ష్యం.. పలు కారణాలను చూపిస్తూ పింఛన్ల కోత.. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, భూ దందాలు.. పెరిగిన విద్యుత్తు, నిత్యావసర ధరలు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకుని వారికి సాంత్వన చేకూర్చడంతోపాటు రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజలకు అందించనున్నారనే విషయాలను తెలియజేసేందుకు శుక్రవారం నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది.

వేర్వేరుగా గ్యాలరీలు

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర తొలి అడుగుకు కుప్పం సిద్ధమైంది. రహదారులు, వీధులన్నీ తోరణాలు, భారీ కటౌట్లు, బ్యానర్లతో పసుపుమయం అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున గురువారం తరలివచ్చారు. భారీ బహిరంగ సభ, గ్యాలరీల ఏర్పాట్లు పరిశీలించారు. సభా వేదికపై 300 మందికి, గ్యాలరీల్లో లక్ష మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకు రెండు, వీఐపీ రెండు, ప్రజలకు 10 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు 500 మంది వాలంటీర్లు, 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ ఉంటుందని నాయకులు తెలిపారు.  

వంటల ఘుమఘుమలు..

సభకొచ్చే ప్రజల ఆకలి తీర్చేందుకు సభా ప్రాంగణ సమీపంలో మూడు భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమతమూరు రోడ్డులో రెండు చోట్ల ఏర్పాటు చేసిన  కేంద్రాల్లో 30 వేల మంది, సభా ప్రాంగణ సమీపంలో 20 వేల మంది భోజనాలు చేసేందుకు వీలుగా షామియానాలు వేస్తున్నారు.

తెలుగు యువత ప్రదర్శన

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కుప్పం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల ఇన్‌ఛార్జులు, కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆధ్వర్యంలో గురువారం గ్రామాల్లో ద్విచక్ర వాహన ప్రదర్శన చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను దిగ్విజయం చేయాలని కోరారు.


తొలిరోజు ఇలా..

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నారా లోకేశ్‌ తొలిరోజు చేపట్టే ‘యువగళం’ పాదయాత్ర వివరాలు విడుదలయ్యాయి.

ఉదయం 10.15: కుప్పం ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం నుంచి బయలుదేరి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.

11.03: పాదయాత్రలో భాగంగా తొలి అడుగు వేసి.. సీనియర్‌ కార్యకర్తల నుంచి ఆశీస్సులు తీసుకోనున్నారు.

11.30: లక్ష్మీపురం మసీదులో ప్రార్థనలు

11.55: హెబ్రోన్‌ చర్చి సందర్శన, ఆపై పాదయాత్ర

12.45- 1.25: అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

2.40: తెదేపా కార్యాలయం వరకు పాదయాత్ర.

3.00: కమతమూరు రోడ్డులోని బహిరంగ సభ స్థలానికి చేరుకుంటారు.

4.35- 6.45: బైపాస్‌ కూడలి నుంచి పీఈఎస్‌ వైద్య కళాశాల వరకు పాదయాత్ర. అక్కడ రాత్రి బస.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని