logo

విజయమే లక్ష్యం

ఆç ఏదైనా అందులో ప్రతిభ చాటుతున్నారు.. చిన్నారులు. విజయమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయిలో దూసుకుపోతున్నారు.

Updated : 27 Mar 2023 04:42 IST

న్యూస్‌టుడే తిరుపతి (క్రీడలు, విద్య), చంద్రగిరి: ఆట ఏదైనా అందులో ప్రతిభ చాటుతున్నారు.. చిన్నారులు. విజయమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయిలో దూసుకుపోతున్నారు. స్కేటింగ్‌లో కష్టాలు అధిగమించి  పతకాలు, రికార్డులు సొంతం చేసుకుని జిల్లా పేరును విశ్వవ్యాప్తి చేశాడు.. దేవిశ్రీప్రసాద్‌. యూట్యూబ్‌ ద్వారా చదరంగంలోని మెలకువలు తెలుసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ    జాతీయస్థాయిలో  రాణిస్తున్నాడు.. తిరుపతికి చెందిన సుధీర్‌.


విశ్వవ్యాప్త ప్రతిభ

దేవిశ్రీప్రసాద్‌

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: తిరుపతికి చెందిన జి.లోకనాథ్‌ బాబు, పద్మ దంపతుల కుమారుడు దేవిశ్రీప్రసాద్‌ స్కేటింగ్‌లో దూసుకెళ్తున్నాడు. తండ్రి లోకనాథ్‌బాబు ప్రోత్సాహంతో కాళ్లకింద చక్రాలు తొడిగి దేశ విదేశాలు చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం తిరుపతి కేంద్రీయ విద్యాలయం-1లో ప్లస్‌ 1 చదువుతున్న దేవిశ్రీప్రసాద్‌.. ఆరేళ్ల వయసు నుంచే స్కేటింగ్‌ శిక్షణలో రాణిస్తున్నాడు. శాప్‌ శిక్షకుడు ప్రేమ్‌నాథ్‌ శిక్షణలో రోడ్డు, రింక్‌, లింబో, రోలర్‌ స్కేటింగ్‌ రాటుతేలిన ఈ చిచ్చరపిడుగు.. ఎనిమిదేళ్ల వయసులో లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వేద విశ్వవిద్యాలయం వద్ద 103.7 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 50 సుమో వాహనాల కింద 8.5 ఇంచ్‌ల ఎత్తులో ముందుకు (ఫార్వర్డ్‌) స్కేటింగ్‌ చేసి కేవలం 19.27 సెకండ్లలో తమిళనాడుకు చెందిన ఐజెక్‌ హెండ్రీ అనే క్రీడాకారుడి కార్డును అధిగమించాడు. అందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘మ్యాన్‌ ఆఫ్‌ ది రికార్డు 2015’ను అందుకున్నాడు. 2017 సంవత్సరంలో 60 కార్ల కింద లింబో స్కేటింగ్‌ చేసిన గిన్నిస్‌ రికార్డు సాధించాడు. వీటితో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో, కేంద్రీయ విద్యాలయం తరఫున దక్షిణాది పోటీల్లో పాల్గొని గుర్తింపు పొందాడు.


బంగారు సుధీర్‌

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పోటీల్లో షీల్డ్‌ తీసుకుంటున్న సుధీర్‌

తిరుపతి పరసాల వీధికి చెందిన కె.తులసీరామ్‌ (రుయా ఆసుపత్రి ఆపరేషన్‌ థియేటర్‌ హెడ్‌), కళావతి దంపతుల కుమారుడు కె.సుధీర్‌. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. 11వ ఏటా క్యారమ్స్‌పై దృష్టి పెట్టాడు. అనంతరం తల్లిదండ్రుల సలహామేరకు చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. యూట్యూబ్‌ ద్వారా చదరంగంలోని మెలకువలు తెలుసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటి రెండుసార్లు అంతర్జాతీయ స్థాయిలో జమ్మూ కశ్మీర్‌తో పాటు అండమాన్‌ నికోబార్‌లో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాడు.

* మే 1,2 తేదీల్లో సింగపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. భారత జట్టు తరఫున ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని