logo

పసి హృదయాలకు భరోసా

చిన్నారులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 350 పడకల ఆస్పత్రిని రూ.320 కోట్లతో తితిదే నిర్మిస్తోంది. ఏడాదిలో అందుబాటులోకి వచ్చే ఆస్పత్రిలో గుండె, న్యూరాలజీ, కాలేయం, గ్యాస్ట్రో, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులకు చికిత్స అందించనున్నారు.

Published : 31 Mar 2023 02:33 IST

రూ.320 కోట్లతో 350 పడకల ఆస్పత్రి
న్యూస్‌టుడే, తిరుపతి(వైద్యం)

ప్రతి వెయ్యి మందిలో పదిమంది శిశువులు ఏదో ఒక గుండె సమస్యతో జన్మిస్తున్నారు. వారిలో మూడోవంతు మందికి మొదటి సంవత్సరంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తేనే బతుకుతారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చేసే ఈ శస్త్ర చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు చేయలేక చాలా మంది మదన పడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రిని తితిదే నెలకొల్పింది. ఏర్పాటు చేసిన 17 నెలల్లో సుమారు 1,200 శస్త్ర చికిత్సలు చేశారు. అందులో 96 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నారు.


కేవలం గుండె జబ్బులకే కాకుండా అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అతిపెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో గుండెతోపాటు కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.

నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి

చిన్నారులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు 350 పడకల ఆస్పత్రిని రూ.320 కోట్లతో తితిదే నిర్మిస్తోంది. ఏడాదిలో అందుబాటులోకి వచ్చే ఆస్పత్రిలో గుండె, న్యూరాలజీ, కాలేయం, గ్యాస్ట్రో, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులకు చికిత్స అందించనున్నారు. దాదాపు పది విభాగాల నిర్వహణ నిమిత్తం అదనంగా 30- 40 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించుకోనున్నారు. కొన్ని రక్త పరీక్షలకు చెన్నై, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అధునాతన ట్యాబోరేటరీ.. 11 ఆపరేషన్‌ థియేటర్లు.. ప్రతి విభాగంలో ఐసీయూ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏడు అంతస్తుల ఆస్పత్రిలో ఒక ఫ్లోర్‌లో అవయవాల మార్పిడికి వినియోగించనున్నారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ (ఎముక మజ్జ మార్పిడి) శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. దాతల నుంచి అవయవాల స్వీకరణ చేపట్టనున్నారు.

గ్రీన్‌ ఛానల్‌ అవసరం లేకుండా..

ఎక్కడో బ్రెయిన్‌డెడ్‌ అయినవారి అవయవాలు తిరుపతికి తీసుకురావాలంటే గ్రీన్‌ ఛానల్‌ భద్రత అవసరం. అవయవాలు రోడ్డు మార్గం ద్వారా సకాలంలో తీసుకొచ్చేందుకు గ్రీన్‌ ఛానల్‌ అవసరం. ఈ ప్రక్రియ వల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. కొత్త ఆస్పత్రి భవనంపై హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి అవయవాలను హెలికాప్టర్‌ ద్వారా నేరుగా ఆస్పత్రిలోకి తీసుకురావచ్చు. ఇక్కడ నుంచి కూడా అవయవాలు తీసుకెళ్లనున్నారు.


అవయవ దానంపై అవగాహన పెరగాలి

- డాక్టర్‌ నరహరి శ్రీనాథ్‌ రెడ్డి, సంచాలకులు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం

పుట్టిన బిడ్డలు బరువు పెరగక పోవడం.. పాలు తాగితే ఆయాస పడటం.. పెదాలు, చేతులు నీలిరంగులో మారే లక్షణాలు ఉంటే వెంటనే చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొస్తే కోలుకునే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్ది గుండె పదిలం కాకపోతే చివరగా గుండె మార్పిడే శరణ్యం. 1967లో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు మొదలైనా.. ప్రజల్లో మరింతగా అవగాహన పెరగాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని