logo

హద్దులు దాటి ఆక్రమణలు

చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) నిర్ధారణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. పట్టణాల్లోని చెరువులు రూపు కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారుల ఉదాసీనత కాగా కొందరు ప్రజాప్రతినిధులు ఇందుకు సహకారం

Published : 31 Mar 2023 02:32 IST

పట్టణాల్లో రూపు కోల్పోతున్న చెరువులు
ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణలో నిర్లక్ష్యం

పెళ్లకూరు, న్యూస్‌టుడే : చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) నిర్ధారణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. పట్టణాల్లోని చెరువులు రూపు కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారుల ఉదాసీనత కాగా కొందరు ప్రజాప్రతినిధులు ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చాలావరకు స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో చేరగా మరికొన్నింటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎత్తుగడ వేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారిని ఆనుకుని అనేక చెరువుల హద్దులు చెరిపేస్తున్నారు.


16 ఎకరాల్లో ఉండాల్సిన తాళ్వాయపాడు చెరువు ఇలా..

పెళ్లకూరు మండలంలో 35 చిన్న నీటిపారుదల చెరువులు ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా ఉన్న తాళ్వాయపాడు సర్వే నం.79-91 వరకు చెరువు 16.51 ఎకరాల విస్తీర్ణం కాగా ఇక్కడ ఆరేడు ఎకరాలకు పరిమితమైంది. దీనిపై ఫిర్యాదులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల భూసర్వే చేసినా హద్దులేర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పెన్నేపల్లిలో సర్వే నంబరు 108-114 వరకు 105.95 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఆక్రమణలకు గురైంది.


గూడూరు రెవెన్యూ డివిజన్‌లో 616, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లో 437 చిన్న నీటిపారుదల చెరువులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాల్లో ఆక్రమణకు గురయ్యాయి. వాగులు, పంట కాలువలు జాడ లేదు. ఆయా ప్రాంతాల్లోని జలవనరుల శాఖ అధికారులు ఎఫ్‌టీఎల్‌ ఎప్పటికప్పుడు నిర్ధారించి హద్దులేర్పాటు చేయాల్సి ఉంది. అటు రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే అధికారులు, జలవనరుల శాఖ సంయుక్తంగా వీటిని అమలు చేయాల్సి ఉంది. చాలాచోట్ల వీటి గురించి ఆయా శాఖలు పట్టింపులేక జలవనరులు పెద్దల చేతుల్లో చేరి వరదల సమయంలో ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.


93.44 ఎకరాలు ఉండాల్సిన నాయుడుపేట ఎల్‌ఏ సాగరం చెరువు దుస్థితి

నాయుడుపేట మండలంలో 63 చిన్ననీటి పారుదల చెరువులు ఉండగా వీటికి 4,420 హెక్టార్ల ఆయకట్టు ఉంది. పట్టణ పరిధిలోని ఎల్‌ఏ సాగరం పరిధిలో చెరువు కట్ట అంచు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఓదఫా ఆక్రమణలు తొలగించినా మళ్లీ కాంక్రీట్‌ నిర్మాణాలు వెలిశాయి. చెరువు సర్వే నంబరు 109 నుంచి 161 వరకు 93.44 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సమీపంలోని భూయజమానులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు మాయం చేస్తున్నారు. సర్వే నంబరు 114 నుంచి 139 వరకు సుమారుగా కాలువ పోరంబోకు 17.61 ఎకరాల భూమి ఎక్కడుందో తెలియని దుస్థితి.


నిర్ధారణకు చర్యలు

- సురేష్‌బాబు, కార్యనిర్వాహక ఇంజినీర్‌, గూడూరు

జలవనరుల శాఖ పరిధిలో చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు చర్యలు తీసుకుంటాం. రీసర్వే నేపథ్యంలో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపడుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని