logo

వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు.

Updated : 28 Mar 2024 05:04 IST

కోడ్‌ అమలులో ఉన్నా ఇష్టారాజ్యంగా బస్సుల కేటాయింపు

ప్రయాణికుల ఇబ్బందులు పట్టని అధికారులు

 శ్రీకాళహస్తి: బస్‌స్టాండ్‌లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

 తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. జిల్లాలోని 11 డిపోలకు చెందిన మొత్తం 379 బస్సులు ఏర్పాటు చేశారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సభకు 197 బస్సులు కేటాయించగా, అవన్నీ ఉదయాన్నే బయలుదేరి నిర్దేశిత ప్రాంతాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలను తరలించారు. గురువారం (28)న నంద్యాల వేదికగా జరగనున్న సభకు 182 బస్సులు కేటాయించినట్లు సమాచారం. ప్రొద్దుటూరుకు వెళ్లిన బస్సులనే నంద్యాలకు కేటాయించారా? వీటితోపాటు అదనంగా ఏర్పాటు చేసిన 182 బస్సులు కలిసి మొత్తం 379 ఏర్పాటు చేశారా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లా ప్రజా రవాణాధికారి, డిప్యూటీ జిల్లా చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లను సంప్రదించినా సమాచారం తెలియదని వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో బస్సుల కేటాయింపునకు సంబంధించి ఓ పారదర్శక విధానం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క తిరుపతి నుంచే 379 బస్సులు కేటాయిస్తే సమీప జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు జిల్లాల నుంచి ఎన్ని బస్సులు కేటాయించారో ఊహించుకోవచ్చు. వరుసగా అధికార పార్టీ రాజకీయ పార్టీ సభలకు ప్రజారవాణాను ఇష్టానుసారం కేటాయించడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.  అధికారుల తీరుతో తిరుమల జిల్లాలోని ఇతర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల బస్సులనూ సిద్ధం సభలకు కేటాయించడంపై ఎన్నికల సంఘం స్పందించాలని వారు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని