జగనన్న.. భూభక్ష చట్టం

ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ   భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది.

Updated : 05 May 2024 07:49 IST

ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
వైకాపా ప్రభుత్వ నిర్ణయాలతో ఆందోళన
న్యూస్‌టుడే, చిత్తూరు (న్యాయవిభాగం)

ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ   భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. రికార్డులున్నా కోర్టుకు వెళ్లినా తిరిగొచ్చే అవకాశం లేకుండా చట్టంతో సామాన్యులను కొట్టేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఇప్పుడే మేలుకోకుంటే ఇక ఎవరి ఆస్తులకు రక్షణ అనేదే ఉండదని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.

సీఎం జగన్‌మెహన్‌రెడ్డి రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని చూడటంపై సర్వత్రా  వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఈ చట్టంపై న్యాయవాదులు మూడు నెలల పాటు పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. భూ వివాదాలను కోర్టులో పరిష్కరించుకునే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాసింది.. దీనిపై న్యాయవాదులు, మేధావులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే..

జిల్లాలో భూసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో  రికార్డులన్నీ తప్పులతడకగా నమోదు చేశారు. దాదాపు అందరికీ సాగు చేసుకుంటున్న, పాత పాస్‌పుస్తకంలో ఉన్న విస్తీర్ణంతో పోలిస్తే తగ్గిపోయింది. ప్రశ్నిస్తే తప్పులను సరి చేసేందుకు రైతులే దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ఆ మేరకు దరఖాస్తులు సమర్పించి ఏడాదిన్నర కావస్తున్నా సరిచేయలేదు. ఇప్పుడే ఇలా ఉంటే  ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితి మరింత దారుణంగా మారనుంది.

ఆందోళన చేస్తున్న న్యాయవాదులు (పాత చిత్రం)

వైకాపా నేతల చేతుల్లోకి....

భూసర్వేతో ఇప్పటికే ప్రభుత్వ, అనాధీనం భూములకు వైకాపా నేతల పేర్లతో ఎల్‌పీ నంబర్లు ఇచ్చారు. వారికి అసైన్‌మెంటు కింద ఇచ్చినట్లు చెబుతున్నారు. వైకాపా నేతలు తమ అనుచరులు, కావాల్సిన వ్యక్తుల పేర్లతో రికార్డుల్లో పేర్లను పొందుపరుస్తున్నారు. వీరి పేరుతో టైటిల్‌ వచ్చిన తర్వాత వారి పేరుతో రాయించుకునే కుట్ర చేస్తున్నారు. తద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ, గ్యాప్‌ ఏరియాలోనూ భూములన్నీ మాయం కానున్నాయి.


హక్కు కోల్పోయినట్లే..

ప్రశ్నించే హక్కు లేకుండా చేసేందుకు వైకాపా ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. ఏకపక్షంగా ఈ చట్టాన్ని తీసుకురావడం శోచనీయం. కొత్త చట్టంతో ఉన్న కొద్దిపాటి ఆస్తిని సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. తాతముత్తాత కాలం నుంచి కొనసాగుతున్న భూ హక్కును కోల్పోయే అవకాశముంది. రైతులు, భూ యజమానులకు ఇది దగా చట్టంగా మారనుంది.

అశోక్‌ఆనంద్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి, బార్‌ అసోసియేషన్‌,చిత్తూరు


నల్ల చట్టమిది ..

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులు, భూ యజమానులు ప్రశ్నించే హక్కు కోల్పోతారు. భూములకు రక్షణ ఉండదు. భూ హక్కుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా చేసిన నల్లచట్టమిది. సొంత ఆస్తులపై యజమాని హక్కుల్లేకుండా చేసింది. తమ ఆస్తులపై యజమాని హక్కును హరించేలా చట్టాన్ని రూపొందించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

విశ్వనాథ్‌, న్యాయవాది, చిత్తూరు


భూ వివాదాలు పెరుగుతాయి

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఈ చట్టం అమలుతో భూ యజమానులకు తెలియకుండానే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. రెవెన్యూ అధికారులకు పెత్తనం అప్పగించి.. ప్రజలకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాలి. భూ వివాదాలు మరింత పెరిగి.. నిజమైన హక్కు దారులకు న్యాయం జరగదు.

పురుషోత్తమరావు, న్యాయవాది, చిత్తూరు


న్యాయం జరగదు..

భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా నిజమైన హక్కుదారులకు న్యాయం జరగదు. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. గోప్యత లేదు. ఈ చట్టంపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేదు. ఆస్తుల క్రయవిక్రయాల సమయంలో సమస్యలు తప్పవు. యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని సివిల్‌ కోర్టుల పరిధి నుంచి తప్పించడం ఏమాత్రం సరికాదు. ఈ చట్టాన్ని రద్దు చేయాలి.

దయాసాగర్‌, న్యాయవాది, చిత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని