logo

బతుకులు.. తలకిందులు..

కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్తలను బలితీసుకుంది. ఈ ఘోరం వారిద్దరి పిల్లలకు, ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న ఇంటి యజమాని తండ్రికి తీరని శోకం మిగిల్చింది. గండేపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లూరుకు చెందిన ఆరుగొల్లు పోతురాజు(45) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Published : 18 Jan 2022 04:20 IST

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతితో విషాదం

తండ్రి, బిడ్డలతో పోతురాజు దంపతులు (దాచిన చిత్రం)
గండేపల్లి, న్యూస్‌టుడే: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యాభర్తలను బలితీసుకుంది. ఈ ఘోరం వారిద్దరి పిల్లలకు, ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న ఇంటి యజమాని తండ్రికి తీరని శోకం మిగిల్చింది. గండేపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లూరుకు చెందిన ఆరుగొల్లు పోతురాజు(45) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాకినాడలో చికిత్సపొందిన తన తండ్రి చినపుల్లయ్యను ఆదివారం ఇంటికి తీసుకొచ్చారు. బ్యాంకు నుంచి నగదు తెచ్చేందుకు భార్య లక్ష్మి(40)తో కలిసి సోమవారం మధ్యాహ్నం జడ్‌.రాగంపేట వెళ్లారు. తిరిగొస్తుండగా జాతీయ రహదారి కూడలి వద్ద విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న విజయవాడకు చెందిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో పోతురాజు దూరంగా ఎగిరిపడడంతో తలపగిలి మృతిచెందారు. లక్ష్మి బోర్లాపడిపోయి అలానే ప్రాణాలు కోల్పోయారు. ఆపకుండా వెళ్తున్న కారును నీలాద్రిరావుపేట కూడలి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమ్మానాన్న ఇక లేరని తెలిపి ఇంజినీరింగ్‌ చదివే కొడుకు వినయ్‌కుమార్‌, ఇంటర్‌ చదివిన కూతురు ఝాన్సీరాణి ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభన్‌కుమార్‌ తెలిపారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి మరో యువకుడు..

బోదులూరు(మారేడుమిల్లి): రంపచోడవరం మండలం తాటివాడకు చెందిన కారం మహేశ్‌(21), అతని స్నేహితులు సోమవారం ‘గుడిస’కు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. బోదులూరు వద్ద వాహనం అదుపుతప్పి పడిపోవడంతో మహేశ్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. అతను ట్రాక్టరు డ్రైవరుగా చేస్తాడని, ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని మారేడుమిల్లి ఎస్సై రాము తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని