logo

ఎడ తీగని వేదన

విద్యుత్తు నిర్వహణ లోపాలు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఊహించని దరిమిలా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అయిన వారిని కోల్పోయి పలువురికి పుట్టెడు దుఃఖం మిగులుతుండగా.. కొన్ని కుటుంబాల జీవనం అత్యంత దయనీయంగా మారుతోంది. కళ్లెదుటే తీగలు.. మృత్యుపాశాల్లా కనిపిస్తున్నా.. నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా... చక్కదిద్దే సత్వర చొరవ కొరవడింది. అధికారుల ఉదాసీనత.

Published : 01 Jul 2022 06:21 IST

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీచౌక్‌

విద్యుత్తు నిర్వహణ లోపాలు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఊహించని దరిమిలా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అయిన వారిని కోల్పోయి పలువురికి పుట్టెడు దుఃఖం మిగులుతుండగా.. కొన్ని కుటుంబాల జీవనం అత్యంత దయనీయంగా మారుతోంది. కళ్లెదుటే తీగలు.. మృత్యుపాశాల్లా కనిపిస్తున్నా.. నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా... చక్కదిద్దే సత్వర చొరవ కొరవడింది. అధికారుల ఉదాసీనత.. క్షేత్రంలో నిర్లక్ష్యం.. సిబ్బంది కొరత.. ప్రజల అజాగ్రత్త.. ఇలా కారణాలు ఏవైనా ఉమ్మడి జిల్లాలో తరచూ విద్యుత్తు ప్రమాదాలతో విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో హైటెన్షన్‌ వైర్లు తెగిపడి గురువారం అయిదుగురు మహిళలు సజీవ దహనమైన ఘటన అంతులేని విషాదం మిగిల్చింది. వర్షాకాలం సమీపించిన తరుణంలో గత అనుభవాలు.. తాజా ఘటనల దృష్ట్యా విద్యుత్తు శాఖ యంత్రాంగం అప్రమత్తమవ్వాల్సిన సమయమిది. ప్రమాదకర స్తంభాలు, కాలం చెల్లిన తీగల మార్పు, ప్రధాన రద్దీ మార్గాల్లో గజిబిజి తీగల సరిజేత.. నియంత్రికల చెంత రక్షణ ఏర్పాట్లు చేసి చక్కదిద్దాల్సిన తరుణమిది.

రాజమహేంద్రవరంలోని రద్దీగా ఉండే మెయిన్‌ రోడ్డులో ఇష్టానుసారంగా ఉన్న విద్యుత్తు తీగలు

సిబ్బంది కొరత.. నిర్వహణ కలత

ఉమ్మడి జిల్లాలో 18 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. నిబంధనల మేరకు.. ప్రతి వెయ్యి కనెక్షన్లకు ముగ్గురు ఉద్యోగుల చొప్పున ఉండాలి. ఈ లెక్కన అన్ని కేటగిరీల వారు 5,400 మంది ఉండాలి. కానీ... 2,600 మందే ఉన్నారు. అంటే సగం మంది కూడా లేరు. ఇప్పటికీ 1993లో మంజూరు చేసిన పోస్టుల లెక్కే కొనసాగుతోంది. వెరసి అధికారులు, సిబ్బందిపై భారం పడుతోంది.

విద్యుత్తు నియంత్రికల వద్ద చిరు వ్యాపారులు

హతవిధీ..

రాజమహేంద్రవరం డివిజన్‌లో ఏడు మండలాలు, నగర పరిధిలో విద్యుత్తు కనెక్షన్లు వస్తాయి. ఇక్కడ జూనియర్‌, సహాయక లైన్‌మెన్లు, లైన్‌మెన్లు కలిపి 1993 పోస్టుల కేటగిరీ ప్రాతిపదికన 320 మంది ఉండాలి. కానీ.. 164 మందే ఉన్నారు. ప్రస్తుతం పెరిగిన కనెక్షన్ల మేరకు 1,000 మంది కావాలి. అంటే పదిమంది చేయాల్సిన పని ఒక్కరే చేస్తున్నారు.

కారణాలు కోకొల్లలు...

సాధారణంగా విద్యుత్తు తీగల జీవిత కాలం 25 ఏళ్లు. గతంలో తయారైన వైర్లు 25 ఏళ్లు దాటినా నాణ్యంగానే ఉండేవి. ప్రస్తుత వైర్లు పదేళ్లకే తెగిపోతున్నాయి. సిబ్బంది కొరతతో.. నిర్వహణ సిబ్బంది అన్ని ఫీడర్లు, నియంత్రికలు, స్తంభాలు, వైర్లు సక్రమంగా ఉన్నాయా లేవా అని తరచూ పర్యవేక్షించలేకపోతున్నారు. హైటెన్షన్‌, లోటెన్షన్‌ వైర్లు ఏవైనా తెగి నేలపై పడితే ట్రిప్పింగ్‌ సిస్టం ద్వారా విద్యుత్తు సరఫరా ఆటోమేటిక్‌గా ఆగుతుంది. చాలా ప్రాంతాల్లో ఈ సిస్టం సక్రమంగా పనిచేయటం లేదు.

బొమ్మూరు పరిధిలో (పాతచిత్రం)

సీతానగరం వాసి పడాల

నీలకంఠ (37) ఈ ఏడాది ఫిబ్రవరి 11న చినకొండేపూడిలో వరి పంటకు ఎరువు వేసేందుకు వెళ్లారు. ఎరువు చల్లే క్రమంలో పంట చేలోంచి వెళ్తున్న విద్యుత్తు తీగలు తగిలి అఘాతానికి గురై మృతిచెందారు. తీగలు కేవలం 5 అడుగుల ఎత్తులో ఉండటం, విద్యుత్తు శాఖ పట్టించుకోక పోవటమే దుర్ఘటనకు కారణం. పంటచేలో వేసిన స్తంభాలు వాలినా వాటిని నిలబెట్టే ప్రయత్నమూ చేయలేదని గ్రామస్థులు ధర్నా చేశారు.

-సీతానగరం

చూస్తే.. హడలే

నేరవార్తలు: రాజమహేంద్రవరం నగర మెయిన్‌రోడ్డులో విద్యుత్తు వైర్లు, నియంత్రికలు ప్రమాదకరంగా ఉన్నాయి. మెయిన్‌రోడ్డు ఆనుకుని కేవీఆర్‌ స్వామి వీధి, పప్పులవారి వీధి, గుండువారి వీధి, గంటాలమ్మగుడి వీధి, ఇసుకవీధి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రోడ్డు, మోచీవీధి, నల్లమందు సందు తదితర వీధులు నిత్యం రద్దీతో ఉంటాయి. ఈప్రాంతాల్లో నియంత్రికలు, తీగలు అస్తవ్యస్తంగా ఉండడం ప్రమాదానికి సంకేతమే.

సమస్యలు పరిష్కరిస్తాం..

ఉమ్మడి జిల్లాలో ఓఅండ్‌ఎం నిధుల కొరత లేదు. ఇప్పటికే నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో చెట్లు నరకటం, కాలం చెల్లిన తీగల మార్పిడి, స్తంభాల సామర్థ్యం పరిశీలించి అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేస్తాం. సిబ్బంది కొరత ఉన్నా.. ఉన్న సిబ్బందిని సమన్వయం చేసి.. ప్రణాళికాబద్ధంగా నిర్వహణ పనులు చేపడుతున్నాం. విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.

-టీవీఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌ఈ విద్యుత్తు శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని