logo

నిధులు ఎవరిస్తారో..?

ప్రతి ఇంట త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 13 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు

Published : 06 Aug 2022 06:27 IST

గోకవరం మండలంలో సిద్ధంచేసిన జెండా కర్రలు

ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, గోకవరం: ప్రతి ఇంట త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 13 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో జెండాలకు అవసరమైన మీటరు పొడవు ఉన్న కర్రల సేకరణలో అటవీశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 4.50 లక్షలు, తూగో జిల్లాలో 3 లక్షలు, కోనసీమ జిల్లాకు 1.50 లక్షల కర్రలు సిద్ధంచేశారు. తూగో, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గోకవరం, సూదికొండ, కాకినాడ, ఏలేశ్వరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి అటవీ రేంజిల పరిధిలో కర్రలను సిద్దం చేసే బాధ్యతలు వనసంరక్షణ సమితి, ఇతర సభ్యులకు అప్పగించారు. తొలుత 19 లక్షలు వరకు కర్రలు సేకరించాలని భావించినా నిధుల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో లక్ష్యాన్ని కుదించారు. అధికంగా వెదురు కర్రలు, లభ్యత లేనిచోట జామాయిల్‌ కర్రలను సేకరిస్తున్నారు. వెదురు బొంగులను సన్నపాటి బద్దలుగా చీరి కట్టలుగా కడుతున్నారు. గోకవరం రేంజి పరిధిలో లక్ష, రంపచోడవరం, సూదికొండ పరిధిలో 70వేలు చొప్పున సిద్ధం చేశారు.

సొమ్ములపై కానరాని స్పష్టత
చెట్లు ఎక్కి కర్రలను నరకడంతో పాటు శ్రమించి వాటిని చీరి కట్టలు కట్టాల్సి ఉంది. కర్రకు రూ.4, రవాణాకు రూపాయి చొప్పున.. కేటాయిస్తామని ప్రకటించినా నిధులు ఎవరు కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలవారీ ఇండెంట్లపైనా ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధంచేసిన కర్రలు తహసీల్దారు కార్యాలయాలకు అందజేయాలా, ఆర్డీవో కార్యాలయాలకు చేరవేయాలా..? అన్నదానిపైనా స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని