logo

వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. అమరావతి రథచక్రాలు

తెలుగు నేల ముక్కలైందనే బాధతో రగిలిపోతున్న ఆంధ్రుల్లో అమరావతి రాజధాని ప్రకటన ఊరటనిచ్చింది. ప్రభుత్వం మారాక రాజధాని వికేంద్రీకరణ తెరమీదకు రావడంతో ఉద్యమ శంఖారావం ప్రతిధ్వనించింది.. ‘జయహో అమరావతి’ అని దీక్షలు, పాదయాత్రలు సాగాయి.. అమరావతే మన రాజధాని అని ఆకాంక్షల స్వరం మిన్నంటింది..

Published : 02 Oct 2022 04:20 IST

నల్లజర్లలో ప్రవేశం నేడు.. మళ్లీ 10న ఆగమనం

మూడు జిల్లాల్లో రైతుల పాదయాత్రకు సన్నద్ధం

ఈనాడు, అమలాపురం

పాదయాత్రలో కదిలిన రథం

తెలుగు నేల ముక్కలైందనే బాధతో రగిలిపోతున్న ఆంధ్రుల్లో అమరావతి రాజధాని ప్రకటన ఊరటనిచ్చింది. ప్రభుత్వం మారాక రాజధాని వికేంద్రీకరణ తెరమీదకు రావడంతో ఉద్యమ శంఖారావం ప్రతిధ్వనించింది.. ‘జయహో అమరావతి’ అని దీక్షలు, పాదయాత్రలు సాగాయి.. అమరావతే మన రాజధాని అని ఆకాంక్షల స్వరం మిన్నంటింది.. దేశ ప్రధాని మోదీ రాజధాని అమరావతే అని నాడు స్వయంగా అంకురార్పణ చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆ కల సాకారానికి నేడు పోరుబాట పట్టాల్సిన పరిస్థితి అక్కడి రైతులది.. ఆ సంకల్పానికి బాసటగా నిలుస్తున్న స్ఫూర్తి ఆంధ్రులది.. అదేక్రమంలో అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్ర (అమరావతి రైతుల మార్చ్‌-22)కు శ్రీకారం చుట్టారు.. ఈ యాత్రకు పడిన అడుగులు జిల్లాలు దాటుతూ ఆకాంక్షల ఉప్పెనై.. తూర్పున తొలి అడుగు వేయనుంది. ఈ యాత్రను రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ప్రజాసంఘాలు స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు.

అభిమానధనులై..

ఆంధ్రుల మదిలో మధురస్మృతిగా నిలిచిన అమరావతి సాకారానికి అభిమానధనులై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులతోపాటు ఊరూవాడా కదులుతున్నారు. 33 వేల ఎకరాల్లో పడిన ఘనమైన పునాదులపై అమరావతి నిర్మాణం జరగాలని మనసావాచా ఆకాంక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్న యాత్ర భౌగోళికంగా ఆ జిల్లాలోని ద్వారకా తిరుమల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్లలోకి ఆదివారం ప్రవేశించనుంది. సోమవారం నల్లజర్ల నుంచి మళ్లీ పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.. తర్వాత ఈనెల 10న తూర్పుగోదావరి జిల్లాలోకి పునరాగమనం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలుపెరగక వడివడిగా సాగుతున్న యాత్ర తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈనెల 24 వరకు సాగుతుంది. తునిలో సత్యదేవుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం యాత్ర అనకాపల్లి- విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం జిల్లా మీదుగా సాగుతూ గమ్యస్థానమైన అరసవల్లి సూర్యభగవానుని సన్నిధికి చేరి ముగుస్తుంది. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగనిరతిని కీర్తిస్తూ ఘన స్వాగతానికి పల్లెలు సిద్ధమవుతున్నాయి.

ఉత్కంఠ నడుమ...

అధికార పక్షం వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయి. అడ్డుకుంటామని కొందరు పేర్కొంటుంటే.... ఎన్ని అవాంతరాలు ఎదురైనా సూర్యదేవుని సన్నిధి వరకు యాత్ర సాగించి తీరతామని రైతులు.. వారి మద్దతుదారులు ప్రతినబూనారు. ఈ క్రమంలో మూడు జిల్లాల పోలీసులు ముందస్తు నిఘా వేసి భద్రత ఏర్పాట్లు చేశారు.

* 4 నుంచి 9 వరకు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది.

* 15, 22న విరామం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని