logo

2.. 8.. 9

దోషరహిత ఓటర్ల జాబితా దిశగా కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాల్లో ఓటు-ఆధార్‌ అనుసంధానానికి ఆగస్టు ఒకటి నుంచి శ్రీకారం చుట్టారు.

Published : 28 Nov 2022 05:56 IST

ఓటు-ఆధార్‌ అనుసంధానంలో మూడు జిల్లాల స్థానాలు
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, అమలాపురం(అల్లవరం), రాజమహేంద్రవరం(వీఎల్‌ పురం)

దోషరహిత ఓటర్ల జాబితా దిశగా కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మూడు జిల్లాల్లో ఓటు-ఆధార్‌ అనుసంధానానికి ఆగస్టు ఒకటి నుంచి శ్రీకారం చుట్టారు. బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆధార్‌ కార్డులు సేకరించి, ఫారం-6బీలో పొందుపరుస్తున్నారు. ఆధార్‌ సేకరణలో బలవంతం లేదని, స్వచ్ఛందంగా సీడింగ్‌ చేసుకోవచ్చునని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు-ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకుంటున్నారు. మూడు జిల్లాల పరిధిలో 60 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పోల్చితే.. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 76.66 శాతంతో రెండో స్థానం, తూర్పుగోదావరి జిల్లా 67.71 శాతంతో 8వ స్థానం, కాకినాడ జిల్లా 66.30 శాతంతో 9వ స్థానంలో ఉన్నాయి. 2023 మార్చి 31 వరకు గడువు ఇచ్చినా... మూడు జిల్లాల కలెక్టర్లు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు వెనుకబడగా.. వాటిని ముందు వరుసలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

కాకినాడ నగర నియోజకవర్గంలో ఆధార్‌ సేకరణకు నిర్వహించిన ప్రత్యేక శిబిరం

ప్రత్యేక శిబిరాలతో..

* మూడు జిల్లాల్లోని 4,834 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు-ఆధార్‌ అనుసంధానానికి సెప్టెంబరు 4, నవంబరు 11న ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియలో ఈనెల 19, 20 తేదీల్లో కూడా వివరాలు సేకరించారు.

* అనుసంధానంలో గ్రామ/వార్డు వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు(ఈఆర్‌వో) ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నిచోట్ల వారిని వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

* ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకే ఫొటోతో రెండు ఓట్లు(ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌)ను గుర్తించారు. వీటిని ఇప్పటికే తొలగించారు.  

* మూడు జిల్లాల్లో నవంబరు 9 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023 చేపట్టారు. కొత్తగా ఓటు హక్కు కల్పించడానికి అవకాశంమిచ్చారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. చేర్పులు, మార్పులు, తొలగింపు, బదిలీకి అవకాశం ఇచ్చారు. డిసెంబరు 8 వరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. nvsp.in, voter portal వెబ్‌సైట్లు, voter helpline యాప్‌లో అర్హులు ఓటు నమోదు చేసుకోవచ్చు.


ఓటర్లు సహకరించాలి

- జి.నరసింహులు, జిల్లా రెవెన్యూ అధికారి, తూర్పుగోదావరి జిల్లా

ఇంటింటికి ఆధార్‌ సేకరణకు వచ్చే బీఎల్‌వోలకు ఓటర్లు సహకరించాలి. సకాలంలో ఆధార్‌ సంఖ్యకు సంబంధించిన వివరాలు అందజేసి, అనుసంధాన ప్రక్రియ పూర్తికి తోడ్పాటు అందించాలి. గడువులోగా ప్రక్రియను నూరుశాతం పూర్తి చేస్తాం. డిసెంబరు నెలాఖరు నాటికి దీన్ని ముగిస్తాం.. కలెక్టర్‌ ఆదేశాలతో ఈఆర్‌వోలు, బీఎల్‌వోలను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాను మెరుగైన స్థానంలో నిలుపుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని