logo

ట్రిపుల్‌ ఐటీ బీటెక్‌ విద్యార్థిని అదృశ్యం

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌(ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) అదృశ్యమైంది.

Published : 07 Dec 2022 02:51 IST

ప్రేమ వ్యవహారమే కారణం

నూజివీడు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌(ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) అదృశ్యమైంది. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి కళాశాల యాజమాన్యం, నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన విద్యార్థిని ఆదివారం సాయంత్రం సెలవుపై బయటకు వెళ్లింది. తిరిగి సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రాంగణానికి వచ్చింది. సాయంత్రం మళ్లీ సెలవు కావాలని అడగటంతో అధికారులు నిరాకరించారు. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీనిపై అప్రమత్తమైన ట్రిపుల్‌ ఐటీ ఔట్‌ పోస్ట్‌ పోలీసులు విచారణ ప్రారంభించగా.. సదరు యువతి ప్రధాన ద్వారానికి కొద్ది దూరంలో ఉన్న కంచె లోంచి బయటకు వెళ్లినట్లు తేలింది. ఆ సమయంలో ఆమెతో ఓ యువకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకొని మంగళవారం ఉదయం ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణానికి యువతి తండ్రి రాగా అతనిని ఆరా తీశారు. తాను, యువకుడు ప్రేమించుకుంటున్నామని.. పెళ్లి కూడా చేసుకుంటామని.. తన కోసం వెతకొద్దని కుమార్తె ఫోన్‌ చేసి చెప్పినట్లు అతను వివరించారు. ఈ మేరకు డీఎస్పీ వివరాలు వెల్లడించారు. అదృశ్యమైన విద్యార్థిని మేజరు కావడంతో కేసు నమోదు చేసి చట్టపరంగా ముందుకు వెళతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని