logo

డ్వాక్రా మహిళలతో రక్షిత వ్యవసాయం

జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో రక్షిత వ్యవసాయం (షేడ్‌ నెట్స్‌) యూనిట్లు నెలకొల్పి.. వారంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉద్యాన పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు.

Published : 03 Feb 2023 06:28 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో రక్షిత వ్యవసాయం (షేడ్‌ నెట్స్‌) యూనిట్లు నెలకొల్పి.. వారంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఉద్యాన పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు. మహిళా స్వయం సమృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో షేడ్‌నెట్స్‌ యూనిట్లు నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల నుంచి పంటలను పరిరక్షించడం ద్వారా అధిక దిగుబడే లక్ష్యంగా, ఆదాయ కల్పన దిశగా చర్యలు చేపడుతున్నారు. పెట్టుబడి నష్టపోకుండా, ప్రయోజనం పొందేలా రక్షిత వ్యవసాయం చేసేలా డ్వాక్రా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.

రూ.1.98 లక్షల  రాయితీ..

కాకినాడ జిల్లాలో నాలుగు కస్టర్లుండగా ఒక్కో క్లస్టర్‌లో కనీసం 20 షెడ్‌నెట్‌ యూనిట్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.4.50 లక్షలుగా నిర్ధారించగా, దీనిలో రూ.1.98 లక్షలు రాయితీ కల్పించనున్నారు. పది శాతం వాటా లబ్ధిదారులు భరించాలి. మిగతా మొత్తం బ్యాంకు రుణంగా కల్పించనున్నారు. షేడ్‌ నెట్‌ వ్యవసాయంలో విదేశాల్లో ఉన్న అధునాత విధానాలను ఇక్కడ అవలంబించడం ద్వారా అధిక ఆదాయం పొందేలా డ్వాక్రా మహిళలను ప్రోత్సహించనున్నారు.

పలు సంస్థలతో ఒప్పందం

ఈ పథకం అమలుకు సంబంధించి 12.50 సెంట్ల సొంత స్థలం ఉన్న మహిళలకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు మహేంద్ర టాప్‌, కేతి కంపెనీలతో సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే పిఠాపురం ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఇటీవల అవగాహన సదస్సు నిర్వహించగా, ఆరుగురు ముందుకొచ్చారు. సామర్లకోట మండలంలో నలుగురు, పిఠాపురం, జగ్గంపేట మండలంలో ఒక్కరు చొప్పున రక్షిత వ్యవసాయ సాగుకు అంగీకారం తెలిపారు. వీరికి సంబంధించిన స్థలాలకు భూసార, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివాహాది శుభకార్యాల్లో అలంకరణ చేసే ఖరీదైన పువ్వులు, ఆకుకూరలు, కాయగూరలు తదితర ఉద్యాన పంటలను షేడ్‌నెట్స్‌ ద్వారా పండించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యాన్ని మహేంద్ర టాప్‌ కంపెనీ చేస్తుంది. పౌల్ట్రీలు, రసాయన ఎరువులు పిచికారీ చేసే ప్రాంతాలు కాకుండా వెలుతురు, గాలీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే రక్షిత వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. నీటిలో పీహెచ్‌ శాతం ఒకటి కన్నా తక్కువగా ఉంటేనే అనుమతిస్తారు. డ్వాక్రా మహిళలను అధునాత వ్యవసాయ విధానం వైపు నడిపించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.


సెర్ప్‌  అధికారులతో..

రక్షిత వ్యవసాయంపై ఆసక్తి, అర్హత ఉన్న డ్వాక్రా మహిళల కుటుంబ సభ్యులు మండలంలోని సెర్ప్‌ ఎంపీఎంను సంప్రదించాలి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నాం. చేయూత మహిళా మార్ట్‌లను నెలకొల్పాం. షేడ్‌నెట్‌ వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరిని గుర్తించి, కొన్ని యూనిట్లు మంజూరు చేశాం. మరిన్ని యూనిట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం.
కె.శ్రీరమణి, పథకం సంచాలకులు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని