logo

ఒత్తిడి తొలగేలా.. హాయిగా చదివేలా..

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడితో కూడిన విద్యను అభ్యసించాల్సివస్తోంది.

Updated : 05 Feb 2023 06:32 IST

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

అమలాపురంలోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో రవిసాగర్‌

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడితో కూడిన విద్యను అభ్యసించాల్సివస్తోంది. అధిక మార్కుల సాధనకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని గంటల తరబడి చదివిస్తున్నారు. ఆటలకు కూడా పంపకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యనందించేందుకు ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ
కమిటీని నియమించారు.

ఇరుకు గదుల్లోనే.. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో చాలాచోట్ల ఇరుకు గదుల్లోనే బోధన చేస్తున్నారు. ప్రయోగ పరికరాలు, ఆటస్థలాలు ఇతర సదుపాయాలేవీ కనిపించడం లేదు. ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థులకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులపై ఒత్తిడి ఉంటోంది. ఎక్కువ ఫీజులు వసూలుచేసే ఐఐటీ, నీట్‌ అర్హత పరీక్షల్లో సీట్లు సాధించేందుకు విద్యార్థులను పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ప్రయోగ పరీక్షలు ప్రతిరోజూ, వారం, నెలవారీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం శుభపరిణామమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

గౌరవాధ్యక్షుడిగా కలెక్టర్‌ నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీకి జిల్లా కలెక్టర్‌ గౌరవాధ్యక్షుడిగా, జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షుడిగా, వృత్తి విద్యాశాఖాధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. డీఈవో, ఐసీడీఎస్‌, పోలీసు, వైద్య, అగ్నిమాపక, ఆహారభద్రత, మానసిక వైద్యుడు తదితర అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి లోటుపాట్లు సరిచేస్తారు.

ఏం చేస్తారంటే..

ప్రతి నెలా విధిగా జిల్లాలోని రెండు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను తనిఖీచేసి కలెక్టర్‌కు నివేదిక అందజేయాలి. కళాశాలలో పరిశీలించి మౌలిక వసతులను కల్పిస్తారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటారు. విద్యాసంస్థల యాజమాన్యాలతోపాటు తల్లిదండ్రులతో మాట్లాడి సూచనలివ్వాలి. ఇంటర్‌ బోర్డు నిబంధనలు పాటీస్తున్నారా, లేదా పరిశీలించి లోటుపాట్లు చర్యలకు ఉపక్రమించాలి.


పూర్తి స్థాయిలో..

ఒత్తిడి లేని విద్య అందించడమే లక్ష్యం. కళాశాలల్లో మరుగుదొడ్లు, కంప్యూటరు, ప్రయోగశాలలు, పరికరాలు, మంచినీరు, భోజనం తదితర సౌకర్యాలను తనిఖీ చేస్తాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పర్యటించాం. పూర్తిస్థాయిలో పర్యవేక్షించి సత్ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం.

ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి, ఇంటర్‌ డీవీఈవో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని