logo

మహిళల ఉపాధికి ఉన్నతి

గ్రామీణ మహిళలు ఇంటిపట్టున ఉంటూనే పలు రకాల ఆహార పదార్ధాల తయారీతో ఉపాధి ఏర్పర్చుకుంటారు.  

Published : 31 Mar 2023 03:33 IST

సంఘ సభ్యులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లు

ఆలమూరు, న్యూస్‌టుడే: గ్రామీణ మహిళలు ఇంటిపట్టున ఉంటూనే పలు రకాల ఆహార పదార్ధాల తయారీతో ఉపాధి ఏర్పర్చుకుంటారు.  కొందరు సొంత పెట్టుబడి, మరికొందరు అప్పుచేసి తయారీ చేపడుతుంటారు. చాలామందికి సకాలంలో సరైన పెట్టుబడి దొరక్క ఆయా రంగాల్లో వెనుకంజలో ఉంటుంటారు. ఇది గుర్తించిన కేంద్రప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా ఆహార, తదితర ఉత్పత్తుల తయారీలో మహిళలు ముందడుగు వేయాలనే సదుద్దేశంతో ‘‘ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజస్‌ స్కీమ్  ’’ (పీఎంఎఫ్‌ఎంఈ) అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో ఎక్కువ రుణం అందించేందుకు సంకల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించి, ఉత్పత్తుల తయారీకి స్థానికంగా  అనుకూల పరిస్థితులను చూసి యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

సహాయక సంఘాలకు మాత్రమే..

పీఎంఎఫ్‌ఎంఈలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉంది. ఇందులో రెండు రకాల రుణాలు అందజేస్తున్నారు. సీడ్‌ క్యాపిటల్‌లో భాగంగా మహిళ స్వయం ఉపాధి కోసం రూ.40వేల రుణం అందిస్తారు. మిషనరీ సపోర్ట్‌ అవసరమై, మరికొందరికి ఉపాధి కల్పించే వారి కోసం హైయర్‌ ఆర్డర్‌గా రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు యూనిట్ అవసరం మేరకు రుణాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో 35శాతం రాయితీ, పది శాతం లబ్ధిదారులు వాటాగా చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఆహార తయారీ యూనిట్కు అవసరమయ్యే డీపీఆర్‌ను అందజేస్తే ముందుగా పరిశ్రమల శాఖ లాగిన్‌కి వెళుతుంది. దాన్ని జనరల్‌ మేనేజర్‌ పరిశీలించి, సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు పంపుతారు. ధ్రువపత్రాలు పరిశీలించిన మీదట నగదు సంబంధిత మహిళ ఖాతాకు జమవుతుంది. యూనిట్ను నెలకొల్పేవారికి రెండు పొదుపు ఖాతాలు (ఎస్‌బీ) ఉండాలి. పాన్‌, ఆధార్‌కార్డు తదితర పత్రాలు సమర్పించాలి.

ఆహార ఉత్పత్తులకు అవకాశం

బేకరీ, త్రుణధాన్యాలు, పాలు, నూనె, చేప, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ, పసుపు, కారం, పిండి గిర్నీలు, పప్పులు తయారుచేసే యంత్రాల కొనుగోలు, స్థానికంగా పండించే పంటలను శుద్ధి చేసి తయారుచేసే ఉత్పత్తుల ఏర్పాటుకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్యాకేజ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అవకాశాలు కల్పిస్తుంది.

వనితలు ముందుకు రావాలి

జిల్లాలో 2020-21లో 247 యూనిట్లు, 2021-22లో 30 యూనిట్లు మంజూరు చేశాం. ఇవన్నీ ఇప్పటికే గ్రౌండింగ్‌ అయ్యాయి. 2022-23కిగాను 340 యూనిట్లు గుర్తించాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీ నుంచి నిధులు అందగానే వారికి రుణాలు అందజేస్తారు. మహిళలు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను రూపొందించడానికి ముందుకురావాలి.

 ఎం.ఎం.జిలానీ, అదనపు పీడీ, డీఆర్‌డీఏ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని