logo

ఇదెక్కడి ప్రభుత్వం ప్రజల్లో తిరగలేకున్నాం..

ఇటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ప్రజలకు ముఖం చూపించలేకున్నాం. గ్రామంలో ఏ కార్యక్రమాన్నీ ముందుండి చేయలేకపోతున్నాం. వాలంటీరుకు ఉన్న గౌరవం కూడా మాకు లేదు.

Published : 07 Jun 2023 05:36 IST

సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను అభినందిస్తున్న వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తదితరులు

న్యూస్‌టుడే, గాంధీనగర్‌, కాకినాడ నగరం: ఇటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ప్రజలకు ముఖం చూపించలేకున్నాం. గ్రామంలో ఏ కార్యక్రమాన్నీ ముందుండి చేయలేకపోతున్నాం. వాలంటీరుకు ఉన్న గౌరవం కూడా మాకు లేదు. సొంత నిధులు రూ.లక్షల్లో వెచ్చించినా రూపాయి కూడా వెనక్కు రాని పరిస్థితి. గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుందామని సర్పంచులుగా పోటీ చేశాం. గెలిచి రెండున్నరేళ్లు అవుతోంది. గ్రామాల్లో ఒక్క పని కూడా చేయలేకపోయాం. ఇదీ.. ఉమ్మడి జిల్లాలో పలువురు సర్పంచుల ఆవేదన.

కాకినాడ నగరంలో ఉమ్మడి జిల్లా సర్పంచుల సదస్సు మంగళవారం జరిగింది. సదస్సుకు అయినవిల్లి సర్పంచి కాకర శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా, అతిథులుగా పంచాయతీ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు తదితరులు హాజరయ్యారు. పార్టీలకతీతంగా తమ హక్కులు, నిధులు, విధుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో పలువురు సర్పంచులు మాట్లాడారు. ఎస్‌.మూలపాలెం సర్పంచి బొబ్బా ప్రభాత్‌ కుమార్‌ మాట్లాడుతూ సచివాలయాల పేరుతో పంచాయతీలకు సమాంతర వ్యవస్థ నెలకొల్పి సర్పంచులకు గౌరవం లేకుండా చేశారన్నారు. జి.మేడపాడు సర్పంచి పటాని వెంకట్రావు మాట్లాడుతూ రెండున్నరేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనిచేయలేకపోయానన్నారు. ఉప సర్పంచిగా సంపాదించిన గౌరవం కూడా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


తెదేపా సర్పంచినని పట్టించుకోవట్లేదు...
- నాగాబత్తుల శాంతకుమారి, మాచవరం

అంబాజీపేట మండలంలో మాదో మేజర్‌ పంచాయతీ. తెదేపా తరఫున గెలవడంతో కార్యక్రమాలకు అధికారులు, అధికార పార్టీ నాయకులను పిలిచి సర్పంచిగా ఉన్న నన్ను పిలవడం లేదు. ప్రజల మధ్యకు వెళ్తుంటే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి . బ్లీచింగ్‌కు కూడా సొంత నిధులు ఖర్చు చేస్తున్నా. ఇప్పటి వరకు ఇలా రూ.17 లక్షల దాకా ఖర్చు చేశా.


దాక్కునే పరిస్థితి...
- మేడిద దుర్గాప్రసాద్‌, కొండుగుదురు సర్పంచి అయినవల్లి మండలం

జనసేన పార్టీ తరఫున ఎన్నికై రెండేళ్లు దాటినా మా ఊరి అభివృద్ధికి ఏమీచేయలేకపోయా. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఎటువంటి ఫంక్షన్లు జరిగినా వెళ్లలేక దాక్కునే పరిస్థితి. జగన్‌ వచ్చాక వాలంటీర్లు, గృహ కన్వీనర్లు, కన్వీనర్లు అంటూ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ, సచివాలయంలో ఈ పనిచేయమని చెప్పడానికి అవకాశం లేకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాల్ని చేశారు.


ముఖం చూపలేకపోతున్నాం
- కాకర శ్రీనివాసు, అయినవిల్లి సర్పంచి

అయిదు వేల ఓటర్లున్న పంచాయతీ మాది. ఎన్నికల్లో గెలిచి రెండున్నరేళ్లు కావస్తున్నా కనీసం పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపర్చి, బ్లీచింగ్‌ చల్లడానికి నిధులు లేవు. మా పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధమైన నిధులూ కేటాయించలేదు. వార్డు సభ్యులు, మేము ప్రజలకు ముఖం చూపించలేక తప్పుకొని తిరుగుతున్నాం.


ఇంత దారుణం ఎప్పుడూ చూడలే..
- సుభాషిణి, తుమ్మలపల్లి, అల్లవరం మండలం

రాజకీయాల్లో 22 ఏళ్లుగా ఉన్నా. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా జమచేస్తామంటూ ఓపెన్‌ చేసిన ఖాతాలో ఒక్క రూపాయి రాలేదు. సచివాలయంలో సర్పంచిని పట్టించుకోని దుస్థితి ఉంది.  


వీధి దీపాలు వేయించలేకపోతున్నాం...
- వార జయసావిత్రి, తొత్తరమూడి సర్పంచి

వైకాపా తరఫున సర్పంచిగా ఎన్నికయ్యా. మాది మేజర్‌ పంచాయతీ. పెద్ద గ్రామంలో నిధుల కొరత కారణంగా పారిశుద్ధ్యం మెరుగుపర్చలేకున్నాం. వీధి దీపాలు కూడా వేయించలేకపోతున్నాం. చాలా వరకు సొంత నగదు ఖర్చుచేస్తూ పనులు చేస్తున్నాం. పూర్తి నిధులు వస్తే అభివృద్ధి చేసి మమ్మల్ని నమ్మి ఓటేసిన గ్రామ ప్రజలకు న్యాయం చేయగలం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని