logo

కొంటారా.. కొర్రీలు వేస్తారా..?

గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

Published : 28 Mar 2024 03:11 IST

బొండాలు ధాన్యం కొనుగోలుపై స్పష్టత కరువు
న్యూస్‌టుడే, ముమ్మిడివరం

కోత దశకు వచ్చిన బొండాలు రకం వరి చేను

త రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో చాలా మంది ఎంటీయూ 1126 రకం సాగు చేయగా.. బొండాలు వేసిన రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురైంది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతులపై మళ్లీ అటువంటి ఒత్తిడే తెచ్చి.. కొనుగోలు విషయంలో తొలుత ఇబ్బందులకు గురి చేశారు. ముందుగా ఎంటీయూ 1126 వంటి సన్నాల రకం ధాన్యం కొనుగోలు చేసి.. చివరిగా బొండాలు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కేంద్రాల్లో బొండాలు రకం ధాన్యం కొనుగోలుపై ఆదిలోనే స్పష్టత ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.78 ఎకరాల్లో రైతులు రబీ సాగు చేపట్టారు. అమలాపురం డివిజన్‌లో ఐ.పోలవరం నుంచి రాజోలు వరకు రబీ సాగు ఆలస్యం కావడంతో కోతలకు ఇంకా కొంత సమయం పట్టినా.. రామచంద్రపురం డివిజన్‌లో ఏప్రిల్‌ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో బొండాలు రకం సాగు చేపట్టారు. అంటే ఆ రకం ధాన్యమే సుమారు 3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సన్నాలు రకం మరో 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సన్నాలు రకం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు ఇబ్బందులు లేకపోయినా.. బొండాలు విషయంలోనే కొంత అస్పష్టత నెలకొంటోంది.

ఎందుకిలా..

ఖరీఫ్‌, రబీల్లో ఆయా కేంద్రాల్లో సేకరించిన ధాన్యం సీఎంఆర్‌కు ఇస్తున్నారు. తద్వారా వచ్చే బియ్యాన్ని పీడీఎస్‌ కింద పేదలకు పంపిణీ చేస్తున్నారు. బొండాలు రకం సీఎంఆర్‌ కింద ఇచ్చినా.. వాటిని కేవలం బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకే ఇవ్వాలి. తద్వారా ఉప్పుడు బియ్యం వస్తాయి. వీటిని పీడీఎస్‌ కింద పంపిణీ చేసే అవకాశం లేదు. కేరళ, ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ వీటిని వినియోగిస్తారు. వీటి ఎగుమతులకు అవకాశం కల్పిస్తే.. రైతులు పండించిన బొండాలు రకం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. గత ఏడాది రబీ సీజన్‌లో కేరళకు బొండాలు బియ్యం అందించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రుల సమక్షంలో ఒప్పందం కుదిరినా.. కోతలు వచ్చే సరికి ఎంత ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్ని మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడం.. కేంద్రాల ద్వారా బొండాలు ధాన్యం కొనుగోలుపై సమాధానం లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. తర్వాత అనుమతులు రాగా వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు ప్రయోజనం పొందడం మినహా రైతులకు ఒరిగిందేమీ లేదు.


60 శాతం పైగానే  సాగు..

రబీలో బొండాలు  60 శాతం పైగానే సాగు చేశారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఎంటీయూ 3626 రకం దేశవాళీ వంగడం (పొట్టి బొండాలుగా పిలుస్తారు). దీనికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండడంతోపాటు ఎగుమతులకు తొలి ప్రాధాన్యమిస్తారు. రెండో రకం హైబ్రీడు బొండాలు (ఒంటి పుల్ల బొండాలు) వీటిని దేశవాళీ బొండాలతో సమానంగా రైతులు సాగు చేశారు. జిల్లాలో ఈ రకం బొండాలు ధాన్యం సుమారు. 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వీటిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోతే.. ధర దళారుల పాలు కావాల్సిందే. జిల్లాలో 161 మిల్లులు ఉండగా.. 380 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.


మద్దతు ధరకు కేంద్రాల్లో అమ్ముకోవాలి
- ఎల్లారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు

ప్రస్తుత రబీలో రైతులు పండించిన బొండాలు (ఎంటీయూ 3626) ధాన్యం కొనుగోలు చేస్తాం. ఏప్రిల్‌ మొదటి, రెండు వారాల్లో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ఆర్‌బీకేల్లో కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తాం. బొండాలు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దు. మద్ధతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని