logo

2,400 ఇళ్ల రద్దు

జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు.

Updated : 28 Mar 2024 05:12 IST

పునాదులు వేయని 25వేల గృహాలకు బిల్లులు రానట్టే

కొమరగిరి లే-ఔట్‌లో నిర్మాణంలో ఉన్న గృహాలు

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. లే-ఔట్లు సిద్ధం చేయకపోవడం, ఊరికి దూరంగా స్థలాలు ఇవ్వడం, ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ విలువ అతి తక్కువగా ఉండటం, కొండలు, గుంటల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీకు గృహ నిర్మాణ సామగ్రి తరలించే అవకాశం లేకపోవడం వంటి అనేక కారణాతో పేదలకు గృహాలు నిర్మించుకోలేకపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల భూసేకరణ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు కనీస పునాదికి శంకుస్థాపన చేయని  ఇళ్లను రద్దు చేశారు.

మూడేళ్లు గడిచినా..?: సీఎం జగన్‌ 2020, డిసెంబరు 25న కొమగిరిలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు.  మూడేళ్లు దాటినా జిల్లాలో 2,400 ఇళ్లకు అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడేమో ఎన్నికల కోడ్‌తో ఈ ఇళ్లను రద్దు చేశారు. ఇళ్లు నిర్మించి ఇస్తామన్న జగన్‌ సర్కార్‌ తర్వాత మాట మార్చడంతో వీరందరికి సొంత గూడు సాకారం కాకుండా పోయింది. రద్దయిన ఇళ్లను ఎన్నికల తర్వాత వచ్చే  ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంటుంది.

గోతులు తవ్వి వదిలేశారు..: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు మండలాల పరిధిలో 259 లే-ఔట్లలో 72,041 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 69,638 ఇళ్ల పనులు ప్రారంభించారు. వీటిలో కేవలం గోతులు తవ్వి, ఫిల్లర్లు వేసి, పునాదులు వేయనివి 25,206 ఉన్నాయి. వీటికి ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. పునాది దశకు చేరితేనే బిల్లులు జారీ మొదలవుతుంది. దీంతో పునాదులు వేయని 25,206 ఇళ్లకు ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పనులు చేపట్టిన బిల్లులు వచ్చే అవకాశం లేదు. పునాది, అంతకన్నా ఎక్కువ ప్రగతిలో ఉన్న వాటికే వివిధ దశల్లో బిల్లులు మంజూరు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పునాదులకు చేరుకోని ఇళ్ల వివరాలను బిల్లులు చెల్లింపు పోర్టల్‌ నుంచి మినహాయించారు. ఆర్థిక స్థోమత సరిపోక చాలా మంది పేదలకు పునాదికి గోతులు తవ్వి, ఫిల్లర్లు వేసి వదిలేశారు. ఇలాంటి వారికి బ్యాంకు నుంచి వడ్డీలేని రుణం రూ.35వేలు ఇప్పిస్తామని చెప్పిన జగన్‌ సర్కార్‌ చాలా మందికి మొండి చేయి చూపింది. పేదలు ఉన్న ఇళ్లను తొలగించుకుని, పాకలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు.


మూడేళ్లలో 35శాతమైనా  దాటలేదు..

జిల్లాలో 1.60 లక్షల మంది పేదలకు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్ల పట్టాలిచ్చారు. వీటిలో 72వేల మందికి మాత్రమే మూడేళ్లలో గృహాలు మంజూరు చేశారు. వీటిలో 35 శాతం ఇళ్లను ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. బుదవారం నాటికి జిల్లాలో 26,106 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే నూరు శాతం పూర్తి చేశారు. వీటిలో ఇంకా 10 శాతం ఫినిషింగ్‌ వర్కుల స్థాయిలో ఉన్నాయి.

  • కాకినాడ నగర నియోజకవర్గంలో 21వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చినా.. ఇప్పటికీ ఒక కుటుంబం కూడా జగనన్న కాలనీ ఇంటిలో నివాసం ఉండకపోవడం గమనార్హం. ఇక్కడ 16వేల ఇళ్లకు పైగా మంజూరు చేసినా, ఇప్పటికీ 1,900 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. జగన్నాథపురంలోని 7వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపినా ఆమోదం లభించ లేదు. వీరికి ఇక గృహాలు మంజూరు కానట్టే.
  • సామర్లకోటలోని ఈటీసీ లే-ఔట్‌లో సీఎం జగన్‌ గృహ ప్రవేశాలను ప్రారంభించారు. ఈ లే-ఔట్‌లో 2,412 ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటికి వెయ్యి లోపు గృహా నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని లే-ఔట్లలో 50 శాతం గృహాలను సైతం పూర్తి చేయలేకపోయారు.

ప్రగతిలో ఉన్నవాటికే బిల్లులు
-ఎన్‌వీవీ సత్యనారాయణ, పీడీ, గృహనిర్మాణ సంస్థ, కాకినాడ

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలు మంజూరైన పనులు చేపట్టిని వాటిని రద్దు చేశారు. పునాదులు తవ్వి వదిలేసిన వాటికి ఇప్పట్లో బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. పునాది దశ దాటి, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు సంబంధించిన పనులు చేపడితే బిల్లులు విడుదల చేస్తారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే సామగ్రి అందజేస్తారు. ఆ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకోవచ్చు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బిల్లులు విడుదల చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని