logo

తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం

ఇంటర్మీడియట్‌.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్‌ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి.

Published : 29 Mar 2024 03:16 IST

‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్‌ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. వీటిని నివృత్తి చేసేలా ‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో దశ-దిశ పేరిట గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కాతేరు తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. మారుతున్న టెక్నాలజీకీ అనుగుణంగా దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సిన కోర్సులను సూచించారు. ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది తర్వాత బ్రాంచి మార్పు, కోర్సుల్లో కొంతకాలం విదేశీ వర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ తదితర అవకాశాలను కేఎల్‌ యూనివర్సిటీలో ఎలా అమలు చేస్తున్నారో వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు వివరించారు. ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్‌ ఇన్‌ఛార్జి టీవీ చంద్రశేఖరప్రసాద్‌ మాట్లాడుతూ.. చదువు పేజీ, ప్రతిభ ద్వారా విద్యార్థుల భవితకు సరిపడా సమాచారాన్ని పత్రికలో ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయం కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు కె.శ్రావ్య, సత్యసాయి రమాదేవి, హెచ్‌వీ శ్రీనివాస్‌, దీపక్‌రెడ్డిలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సదస్సులో తమ అభిప్రాయాలను చక్కగా వెల్లడించిన విద్యార్థులు ఆదిత్య, ప్రణతిలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.


కోర్సుల ఎంపిక ముఖ్యం

ఇంటర్‌ తర్వాత ఏయే కోర్సులను ఎంపిక చేసుకోవాలనే దానిపై విద్యార్థులు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యతోపాటు విషయ పరిజ్ఞానంపై విద్యార్థులు దృష్టి సారించాలి. కేవలం ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తే ఉన్నత స్థాయికి చేరలేం. గతంలో బీటెక్‌ సర్టిఫికెట్‌ ఉంటే సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేవారు. ప్రస్తుతం వాటికి కాలం చెల్లింది. ఎంపిక చేసుకున్న గ్రూప్‌లతోపాటు ఇతర రంగాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం వల్ల మాత్రమే ఉన్నత ఉద్యోగాలు పొందగలుగుతారు. అటువంటి కోర్సులు, విద్యా విధానం ఉన్న కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. కోర్సుల ఎంపికలో ముందుచూపు లేకపోతే ఆ ప్రభావం విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుపై పడుతుంది. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి.

జె.శ్రీనివాసరావు, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌, కేఎల్‌ యూనివర్సిటీ


పోటీతత్వం అవసరం

ఏ రంగమైనా పోటీతత్వం ఉంటేనే విజయం సాధించగలం. అందుకోసం విద్యార్థులకు అవగాహనతోపాటు శిక్షణ అవసరం. ప్రపంచంతో మన దేశం పోటీపడుతున్న తరుణంలో మనవంతుగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టిసారించాలి. అందుకోసం ఇటువంటి వేదికలను  సద్వినియోగం చేసుకోవాలి.

బొబ్బిలి సత్యనారాయణ మూర్తి, కేఎల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అడ్మిషన్స్‌


సరైన విద్యా బోధన ఉండాలి

విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా బోధన జరగాలి. ఆ మేరకు విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కేటగిరి-1 వర్సిటీలో కేఎల్‌ యూనివర్సిటీ కూడా ముందు వరుసలో ఉంది. అవకాశాలు అందిపుచ్చుకొనే విద్యావిధానంతోపాటు ఆయా రంగాలపై అత్యుత్తమ శిక్షణ ఉంటుంది. దీంతో సులువుగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

హెచ్‌ఎస్‌ఆర్‌ మూర్తి,కేఎల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అడ్మిషన్స్‌


ప్రతి అడుగు కీలకం

ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకొన్నప్పుడే మంచి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది.  ఇంటర్‌ తర్వాత విద్యార్థులు వేసే ప్రతీ అడుగు కీలకం. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని భారత దేశం శాసిస్తుంది. తద్వారా పలు ఉపాధి అవకాశాలు ఇక్కడే లభించే ఆస్కారం ఉంది. ఇంటర్‌ తర్వాత ఎంపిక చేసుకునే గ్రూప్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి భవిష్యత్తుకు ఇప్పుడు తీసుకునే ఆలోచనే పునాది కావాలి.

జి సతీష్‌బాబు, తిరుమల విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌


తల్లిదండ్రులూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ఇంజినీరింగ్‌ కోర్సులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. ఇంటర్‌ తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులు, వాటిలో రాణించే విధానంపైనే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ మేరకు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ  తీసుకొని ముందుగా అవగాహన చేసుకోవడం ద్వారా ఉన్నత స్థితికి మంచి ప్రణాళికలను సిద్ధం చేసినట్లవుతుంది.

వి.శ్రీహరి, తిరుమల కళాశాల ప్రిన్సిపల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని