logo

పేపరుమిల్లు కార్మికుల ఆందోళన

సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్‌ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్‌మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్‌మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు.

Published : 19 Apr 2024 04:56 IST

సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు
కాన్వాయ్‌లోకి పిలిచి మాట్లాడిన సీఎం జగన్‌

న్యాయం చేయాలంటూ జగన్‌ కాన్వాయ్‌ దగ్గరకు చేరుకున్న కార్మికులు

బొమ్మూరు, న్యూస్‌టుడే: సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్‌ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్‌మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్‌మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని కార్మికులు ఒక్కసారిగా కాన్వాయ్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసు బలగాలు ఎంతగా వారించినా కార్మికులు సీఎం బస్సు ముందుకు చొచ్చుకువచ్చి న్యాయం చేయాలని కోరారు. సమస్యలు వివరిస్తూ రాసిన పత్రాలను జగన్‌కు చూపించారు. వెంటనే కార్మిక నాయకులను బస్సులోకి పిలిపించి వారితో సీఎం మాట్లాడారు. సీఎంను కలిసిన అనంతరం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జె.వై.దాస్‌ మాట్లాడుతూ ఒప్పంద కార్మికుల సమస్యలు వివరించామని చెప్పారు. మొత్తం 11 ట్రేడ్‌ యూనియన్లు కలిసి వేతన ఒప్పందం చేయాలని కోరుతున్నా యాజమాన్యం స్పందించడంలేదని సీఎంకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతి మూడున్నరేళ్లకు  జరగాల్సిన ఒప్పందం అమలు చేయడంలేదని చెప్పామన్నారు. దీనిపై స్పందించిన జగన్‌ మాట్లాడతూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

స్తంభించిన ట్రాఫిక్‌..

కార్మికుల ఆందోళనతో మిల్లు పరిసరాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. పేపర్‌మిల్లు పరిసరాల్లో అధిక సంఖ్యలో గుమిగూడిన కార్మికుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కార్మిక నాయకులతో సీఎం మాట్లాడిన అనంతరం కార్మికులు శాంతించారు. అనంతరం సీఎం బస్సుపైకి ఎక్కి కార్మికులకు అభివాదం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని