logo

రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల

ఎటు చూసినా ల్యాండ్‌, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్‌...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

Published : 01 May 2024 05:37 IST

మెగా డీఎస్సీ అంటూ దగా చేసిన జగన్‌

అంబాజీపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు

అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, న్యూస్‌టుడే: ఎటు చూసినా ల్యాండ్‌, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్‌...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఏపీ న్యాయయాత్ర పేరిట మంగళవారం అంబాజీపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభకు అమలాపురం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మెగా డీఎస్సీ ఎందుకు ఇవ్వలేదో జగన్‌ నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలను చెప్పుకోలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని దుయ్యబట్టారు. పెట్రోలు, డీజిల్‌ తదితర ధరలు పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. మీ బిడ్డలకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని...రాజధాని నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని షర్మిల ఆవేదన చెందారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ అప్పనపల్లి ఎత్తిపోతల పథకం, ఎదురు బిడిం కాజేవే నిర్మాణం, నియోజకవర్గంలో నదీకోత నివారణ ఇలా పలు సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పిన సమయంలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాచవరపు శివన్నారాయణ, మహ్మద్‌ ఆరీఫ్‌, ఇస్మాయిల్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు నెల్లి వెంకటరమణ, ఆదుర్తి నారాయణమూర్తి, సీపీఐ నాయకులు సత్తిబాబు, వెంకటేశ్వరరావు, ఆనందరావు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని