logo

ఆగని అధికార పార్టీ ఆగడాలు

ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు.

Published : 01 May 2024 05:06 IST

ఎన్నికల వేళ ఇసుకాసురుల దందా

బల్లిపాడులో ఇసుక లారీలను అడ్డుకున్న కూటమి నాయకులు

 తాళ్లపూడి, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు, కుమారదేవం ఇసుక ర్యాంపుల్లో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. లారీలను నిలిపేశారు. అక్రమంగా ఇసుకను లోడు చేసే పొక్లెయిన్లను ఆపేశారు. మైనింగ్‌ తదితర శాఖల అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతున్నారని అంటున్నారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి వారితో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు.

ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలున్నా..

అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఎన్జీటీ, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవట్లేదని తెదేపా, జనసేన, భాజపా తదితర పార్టీల నాయకులు ఆరోపించారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఓపెన్‌ ర్యాంపులో పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వుతున్నారని ఆరోపించారు. బిల్లులు లేకుండా దర్జాగా అక్రమంగా దోచేస్తున్నారని విమర్శించారు.

డ్రెడ్జింగ్‌ పేరుతో దోపీడి..

గోదావరి తీరాన ర్యాంపుల్లో పడవల మీద ఇసుక తెచ్చేలా పేరుకే బోట్స్‌మెన్‌ సొసైటీలను ఏర్పాటు చేశారు. అంతా అధికార పార్టీ నాయకులదే దందా. చిన్నపడవల యజమానులు, కార్మికులను బెదిరించి భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. తాళ్లపూడిలో రెండుచోట్ల బోట్స్‌మెన్‌ సొసైటీ ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయవు. ఇసుక తూకం వేసేందుకు వేయింగ్‌ యంత్రాలు ఉండవు. రాకపోకలు సాగించే రహదారుల్లో గేట్లు ఉండవు.

వైకాపా నాయకులతో కుమ్మక్కై..

తాళ్లపూడి మండలం బల్లిపాడు- కొవ్వూరు మండలం చిడిపి మధ్య ఉన్న ఓపెన్‌ ర్యాంపులో అయిదేళ్ల నుంచి వైకాపా నాయకుల కనుసన్నల్లో ఇసుకను భారీ పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ దందా ఆగలేదు. ఈ ఓపెన్‌ ర్యాంపుల్లో లంక భూములను సైతం తవ్వేస్తున్నారని దళితులు ఆందోళనా చేసినా ప్రయోజనం శూన్యం. ఈ దందాతో కొంతమంది స్థానిక వైకాపా నాయకులు నెలకు
రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణానికి హానీ కలిగించేలా తవ్వకాలు జరుగుతున్నా...మైనింగ్‌, రెవెన్యూ, ఏజీఆర్‌బీ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని