logo

పరారీలో అధికార పార్టీ నేతలు

పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.

Published : 01 May 2024 04:39 IST

మద్యం డంప్‌ కేసుల్లో రక్షించే ప్రయత్నం 

పిఠాపురం: పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు. వీరికి ఎక్సైజ్‌ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 26న నాలుగు ప్రాంతాల్లో మద్యం నిల్వలను సెబ్‌, పోలీసు అధికారులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పిఠాపురం గ్రామీణ, పట్టణ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. ఇవికాక సాలిపేటలో అంబటి వీర వెంకట సత్యనారాయణరెడ్డి ఇంట్లో 290 పెట్టెలు, వైఎస్సార్‌ గార్డెన్స్‌లో వైకాపా పట్టణ అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు బొజ్జా వీరబాబు ఇంట్లో 290 పెట్టెల మద్యం పట్టుబడింది. మద్యం దొరికినప్పటి నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారు. ఇవి ఎక్కడినుంచి వచ్చాయి? ఇంకా నిల్వలు ఎక్కడున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టడంలో తాత్సారం వహిస్తున్నారు. ఈ కేసుల్లో పురోగతి ఇంతవరకూ వెల్లడించలేదు. వైకాపా నేతల ఒత్తిళ్లకు సెబ్‌ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలోనే సాలిపేట, వైఎస్సార్‌ గార్డెన్స్‌ ప్రాంతాల్లోని మద్యం నిల్వలకు సంబంధించి వైకాపా నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరికి బెయిల్‌ వచ్చే విధంగా సెబ్‌ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన నిందితులిద్దరూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. వైకాపా నేతలు వీరిద్దరినీ కేసుల నుంచి బయట పడేసేలా సెబ్‌ అధికారులతో మంతనాలు సాగిస్తున్నట్లు విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని