logo

మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు

రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం.

Updated : 01 May 2024 05:44 IST

 అధికార పార్టీ నేత తీరుతో అయిదేళ్లూ ఆందోళనే 
 దినోత్సవ వేళా శ్రామికుల్లో కనిపించని సంతోషం

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ : రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. అయిదేళ్ల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న మిల్లులో అధికార వైకాపా నాయకులు తలదూర్చారు. కార్మికులకు కొండంత అండగా ఉంటామని నమ్మబలికారు.  చివరకు మిల్లు మూతబడే పరిస్థితికి తీసుకొచ్చేశారు. కార్మిక దినోత్సవం వేళ సంతోషం నిండాల్సిన శ్రామికుల కళ్లు కన్నీళ్లు పెడుతున్నాయి. సుమారు 3,600 మంది కార్మికులు.. 11 కార్మిక సంఘాలు.. ఏటా రూ.200 కోట్లకు తగ్గని నికర లాభంతో నిత్యం సందడిగా నడిచే పేపరు మిల్లులో అధికార పార్టీ నాయకులు వేలు పెట్టారు. కార్మికులకు మాయమాటలు చెప్పి ఉద్యోగాల పేరిట ఎర వేశారు. దీనికి ఓ కార్మిక నేత సహకరించడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి సై అనడంతో అడ్డూఆపూ లేకపోయింది.

శాశ్వత కొలువు పేరిట మోసం

2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మిల్లు యూనియన్‌లో తలదూర్చింది. అప్పటికే కొత్త వేతన ఒప్పందం కోసం కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అదే సమయంలో గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్‌ నేతను నగరంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి తనవైపు తిప్పుకొన్నారు. అక్కడ నుంచి మిల్లులో కొత్త పోకడలకు తెరతీశారు. అధికార పార్టీలో చేరిన కార్మిక నేత.. పరంపర-1, పరంపర-2 పేరుతో ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయిస్తామంటూ కార్మికులకు ఆశ చూపారు. సర్వీసులో ఉన్న కార్మికుల పిల్లలకు నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ఉద్యోగాలు వేయిస్తామని ఆశ చూపారు. వీఆర్‌ఎస్‌కు మిల్లు యాజమాన్యం ప్రకటన ఇవ్వడం కార్మిక నేతకు కలిసి వచ్చింది. వాస్తవానికి అయిదారేళ్లు సర్వీసు ఉన్నవారు వీఆర్‌ఎస్‌కు అర్హులు. ఈ నిబంధనలకు విరుద్ధంగా కార్మికులకు వీఆర్‌ఎస్‌లు ఇప్పించి, పిల్లలకు ఉద్యోగాలు వేయించారు. అందుకుగాను కార్మికుల వద్ద నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

ముఖ్యమంత్రికే విన్నవించినా..

పది రోజుల క్రితం రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు మిల్లు కార్మికులు జరిగిన విషయాన్ని తెలియజేశారు. రోడ్డు షోను కార్మికులు ఆపి.. బస్సులోకి వెళ్లి విషయం మొత్తం ఆయనకు వెల్లడించారు. మీ నేత ఇదంతా చేశారని.. కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వెలిబుచ్చారు. అయినా ఫలితం శూన్యం.

సీనియార్టీ పక్కనపెట్టి..

మరోవైపు ఒప్పంద కార్మికులను పర్మినెంటు చేసే విధానంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది. ప్రధానంగా సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలి. అలాంటిది సీనియారిటీ తక్కువ ఉన్న కార్మికుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి సీనియారిటీ మార్పించారు. దీన్ని కొందరు కార్మికులు బహిరంగంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కార్మికుల బదిలీల్లోనూ కొత్త రాజకీయాలకు తెరలేపారు. మొత్తంగా 190 పోస్టులకు సంబంధించి అక్రమ నిబంధనలతో ప్రజాప్రతినిధి, కార్మికనేత సొమ్ము చేసుకున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆవేదనే మిగిలింది..

మిల్లు చరిత్రలో 24 రోజులపాటు మూతబడిన ఘటనే లేదు. నూతన ఒప్పందం కోసం మొదలైన వివాదం.. అధికార పార్టీ నేత కలగజేసుకోవడంతో చిలికిచిలికి గాలి వానగా మారింది. మొత్తం అయిదేళ్లపాటు కార్మికుల హక్కులు నెరవేరలేదు. జీతాలు పెరగలేదు. సీనియారిటీ ప్రకారం అర్హులకు పర్మినెంటు కాలేదు. సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడడంతో అధికారపార్టీ నేత పక్కకు జరిగిపోవడం, కార్మిక నేత కూడా తప్పుకోవడంతో దిక్కుతోచని కార్మికులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించారు. దీంతో యాజమాన్యం లాకౌటుకు నోటీసు జారీ చేసింది. అధికారులు కలగజేసుకొని సర్ధి చెప్పడంతో ఇరువర్గాలు ప్రస్తుతానికి శాంతించారు. కార్మికనేత మాత్రం విశాలవంతమైన భవనాన్ని సమకూర్చుకున్నారని, అండగా నిలుస్తానని చెప్పిన ప్రజాప్రతినిధి కూడా అందినకాడికి వాటాలు పంచేసుకున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని