logo

పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు

కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు.

Published : 01 May 2024 05:33 IST

కుమారుడి ప్రాణం తీసిన తండ్రి

అరవింద్‌ (పాతచిత్రం)

 సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు.. కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు.. ఇంద్రపాలెం వివేకానంద స్కూల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న గుడాల వెంకటరమణ (బుజ్జి) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు అరవింద్‌(26) కూడా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా పనిమానేసి.. మద్యం, గంజాయికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి కూడా అరవింద్‌ మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను రూ.మూడు లక్షలు కావాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయంపై తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున తండ్రి వెంకటరమణ ఇనుపరాడ్‌తో కుమారుడు అరవింద్‌ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

నిందితుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అరవింద్‌ ఇటీవల ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండి సెటిల్‌మెంట్‌ చేసుకుని బయటపడినట్లు తెలుస్తోంది.

మత్తులో వ్యక్తిపై చాకుతో దాడి

పిఠాపురం: జగ్గయ్యచెరువులో మద్యం మత్తులో ఓ వ్యక్తి మరొకరిపై చాకుతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఎస్సై మురళీ మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం... తణుకు పట్టణానికి చెందిన ఆరుగురు బృందం రాడ్‌ బైడింగ్‌ వర్కు చేస్తుంటారు. కుమార పురంలో పనిచేస్తూ.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో చాకుతో సరెళ్ల శ్రీను అనే వ్యక్తి సిరిలి రాంబాబును పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పోయారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మద్యం మత్తు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతుండగా..కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గంలో రోజురోజుకూ గంజాయి, డ్రగ్స్‌ వినియోగం పెరిగి పోతుండటం ప్రమాదకరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని